‘అంకుల్‌’ గొంతు కోశాడు

28 Jun, 2018 14:25 IST|Sakshi
నిందితుడ్ని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

ఏడేళ్ల చిన్నారిపై కిరాతకం. స్కూల్‌ నుంచి అపహరించిన ఓ మానవ మృగం అఘాయిత్యానికి పాల్పడింది. చావుబతుకుల మధ్య ఆ చిన్నారి ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే...

మాందసౌర్‌: స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో బాధిత బాలిక(7) రెండో తరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం బాలికను తీసుకొచ్చేందుకు ఆమె తాత స్కూల్‌కు వెళ్లాడు. అయితే ఇంట్లో ఎవరికో సీరియస్‌ ఉందని ఆమె ‘అంకుల్‌’ వచ్చి ఆమెను తీసుకెళ్లిపోయాడని స్కూల్‌ యాజమాన్యం తెలిపింది. దీంతో కంగారు పడిన ఆ పెద్దాయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో గాలింపు చేపట్టారు. స్కూల్‌కు 700 మీటర్ల దూరంలోని పొదల్లో బాలిక రక్తపు మడుగులో కొట్టుమిట్లాడుతూ కనిపించింది. పక్కనే చిన్నారి స్కూల్‌ బ్యాగ్‌, లంచ్‌ బాక్స్‌, ఓ బీర్‌ బాటిల్‌ పడి ఉన్నాయి. బాలికను హూటాహూటిన మాందసౌర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాలికపై అత్యాచారం జరిగిందని, గోంతు కోసి, ముఖంపై గాట్లు పెట్టారని, ఒళ్లంతా గాయాలయ్యానని వైద్యులు వెల్లడించారు. 24 గంటలు గడిచినా పరిస్థితి మెరుగుపడకపోవటంతో ఇండోర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

నిందితుడి అరెస్ట్‌... 
సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ‘అంకుల్‌’ కోసం గాలింపు చేపట్టారు. ఓ వ్యక్తిని బాలిక అనుసరిస్తున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. నిందితుడిని ఇర్ఫాన్‌గా గుర్తించిన పోలీసులు బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయితే నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం అధికారులు తెలియజేయలేదు. ఈ ఘటనపై స్థానికుల ఆగ్రహానికి లోనయ్యారు. రోడ్ల మీదకు చేరి ధర్నా చేపట్టారు. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.

మరిన్ని వార్తలు