భార్యాభర్తల మధ్య విభేదాలే మణిక్రాంతి హత్యకు కారణం...

16 Aug, 2019 18:27 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిక్రాంతి హత్యకేసులో నిందితులను విజయవాడ పోలీసులు శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రధాన నిందితుడు ప్రదీప్‌తో పాటు క్యాబ్‌ డ్రైవర్‌ భవానీ ప్రసాద్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేసి, సెక్షన్‌ 302, 498-A కింద కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ విజయరావు మాట్లాడుతూ...భార్యభర్తల మధ్య విభేదాలే మణిక్రాంతి హత్యకు ప్రధాన కారణమన్నారు. సీసీ ఫుటేజ్‌, ప్రత్యక్ష సాక్షులు, ఆయుధం పిడి, మృతురాలి రక్త నమూనా ఆధారంగా కేసు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. 

దారుణం: భార్య తలను శరీరం నుంచి వేరు చేసి..

హత్యకు ముందురోజు మణిక్రాంతి ఇంటివద్ద క్యాబ్‌ డ్రైవర్‌ భవానీ ప్రసాద్‌, ప్రదీప్‌ రెక్కీ నిర్వహించారన్నారు. అయితే తల లేకున్నా డీఎన్‌ఏ ద్వారా మృతదేహాన్ని గుర్తించవచ్చని అన్నారు. డీఎన్‌ఏ టెస్ట్‌ ద్వారా నిందితులకు శిక్షపడేలా చేస్తామన్నారు. వర్షాలతో పాటు వరదల కారణంగా తల కొట్టుకుపోయి ఉంటుందని తాము భావిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సహకారంతో తల కోసం తీవ్రంగా గాలించామన్నారు. అలాగే హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు ప్రదీప్‌ ఉపయోగించిన సెల్‌ ఫోన్‌ కూడా ఇంకా దొరకలేదని తెలిపారు.  నిందితుడు ప్రదీప్‌పై సత్యనారాయణపురం, సూర్యారావుపేట, మాచవరం పోలీస్‌ స్టేషన్స్‌ పరిధిలో పలు కేసులు ఉన్నాయన్నారు.

చదవండి: మణిక్రాంతి కుటుంబానికి వాసిరెడ్డి పద్మ పరామర్శ

కాగా ఈ నెల 11వ తేదీన విజయవాడ సత్యనారాయణపురం  శ్రీనగర్‌ కాలనీలో మణిక్రాంతిని ఆమె భర్త ప్రదీప్‌ తలనరికి పాశవికంగా హత్య చేశాడు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మణిక్రాంతి భర్త ప్రదీప్‌పై పోలీసులకు దాదాపు 10సార్లు ఫిర్యాదు చేసింది. అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలో మణిక్రాంతిపై పగ పెంచుకున్న ప్రదీప్‌ ఆమెపై కత్తితో దాడి చేసి తల నరికి కాలువలో పడేశాడు. మణిక్రాంతి తల ఇంతవరకు దొరకలేదు. దీంతో తల లేకుండానే వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. వేరే గత్యంతరం లేకపోవడంతో కుటుంబ సభ్యులు మణిక్రాంతి మొండానికి అంత్యక్రియలు చేశారు.

మరిన్ని వార్తలు