కడతేర్చడానికే పక్కాగా స్కెచ్‌!

27 Oct, 2018 04:19 IST|Sakshi

ప్రతిపక్షనేత హత్యకు వేదికగా సీఐఎస్‌ఎఫ్‌ పహారాలోని విమానాశ్రయం ఎంచుకోవడంపై అనుమానాలు

అక్కడ హత్య చేస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదని భావన

విమానాశ్రయంలో రెస్టారెంట్‌ నిర్వహిస్తున్న టీడీపీ కీలకనేత హర్షవర్ధన్‌ప్రసాద్‌ చౌదరి

ప్రొఫెషనల్‌ కిల్లర్లతో టీడీపీ కార్యకర్త శ్రీనివాసరావుకు తర్ఫీదు ఇప్పించారంటోన్న ఠాణేలంక ప్రజలు

ఎయిర్‌పోర్ట్‌ రెస్టారెంట్‌లో శ్రీనివాసరావు చెఫ్‌గా చేరిక

అత్యంత పదునైన కత్తితో ప్రతిపక్ష నేత గొంతులోకి దించి హత్య చేయడానికి స్కెచ్‌

హత్యాయత్నం నుంచి అదృష్టవశాత్తు బయటపడిన జగన్‌

కేసును నీరుగార్చడానికి సర్కారు కుట్రలు

నిందితుడి జేబులో లేఖపై అనేక సందేహాలు

 కేసును నీరుగార్చుతున్నారనడానికి సర్కార్‌ ఫ్లెక్సీ విన్యాసాలే నిదర్శనమంటోన్న రిటైర్డు డీజీపీ

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ని అంతమొందించడానికి కుట్ర పన్నారా?అత్యంత ప్రజాదరణ ఉన్న జననేతను కడతేర్చడం ద్వారా మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని స్కెచ్‌ వేశారా? జగన్‌ని హత్య చేసి.. దాన్ని మరొకరిపై నెట్టేసి, ప్రజల దృష్టిని ఏమార్చేందుకు తాను రచించిన ‘గరుడ’ పురాణాన్ని సినీ నటుడు శివాజీ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయించారా?..ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నారు రాజకీయ పార్టీ నేతలు, ప్రజాసంఘాల నేతలు, సామాజిక వేత్తలు, సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు. విశాఖపట్నం విమానాశ్రయంలో రెస్టారెంట్‌ నిర్వాహకుడుగా టీడీపీ నేత హర్షవర్దన్‌ ప్రసాద్‌ చౌదరి ఉండడం.. ఉత్తరాంధ్రలో పాదయాత్ర జరిగినన్ని రోజులూ ప్రతి గురువారం హైదరాబాద్‌కు వెళ్లేందుకు ప్రతిపక్ష నేత విశాఖ విమానాశ్రయానికి వస్తుండడం.. విమానాశ్రయం సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌) పహారాలో ఉండటంతో ఆయన్ను అంతమొందించడానికి విమానా శ్రయాన్నే వేదికగా చేసుకున్నారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో గాజువాక నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ ప్రసాద్‌ చౌదరితో కలసి ప్రతిపక్ష నేత హత్యకు సర్కారు కుట్ర పన్నిందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

ప్రొఫెషనల్‌ కిల్లర్‌గా శ్రీనివాసరావుకు తర్ఫీదు..
తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం ఠానేలంకకు చెందిన జనిపెల్ల శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త. శ్రీనివాసరావు బాబాయి నాగేశ్వరరావు ఆ గ్రామ తాజా మాజీ ఉప సర్పంచిగా పనిచేశారు. శ్రీనివాసరావు సోదరుడు సుబ్బరాజు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబం టీడీపీలో కొనసాగుతున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లతో మాట మార్చారు. గత కొన్ని నెలలుగా శ్రీనివాసరావుకు తర్ఫీదును ఇచ్చి ప్రొఫెషనల్‌ కిల్లర్‌గా మార్చారని ఠాణేలంక వాసులు చెబుతున్నారు. తమకు సహకరిస్తున్న శ్రీనివాసరావు కుటుంబానికి ఆరునెలలక్రితమే పక్కా ఇంటిని మంజూరు చేసింది. ఎస్సీ కార్పొరేషన్‌ రుణం కోసం శ్రీనివాసరావు కుటుంబంతో దరఖాస్తు చేయించారు. అంతేగాక శ్రీనివాసరావుకు భారీ ఎత్తున సుఫారీ(నగదు) ముట్టజెప్పినట్లు ఆ గ్రామవాసులు చెబుతున్నారు.

సుఫారీగా ఇచ్చిన సొమ్ముతోనే శ్రీనివాసరావు తన లైఫ్‌ సెటిల్‌ అయ్యిందంటూ ఇటీవల సన్నిహితులు, మిత్రులకు భారీ ఎత్తున పార్టీ ఇచ్చినట్లు నిందితుడి సన్నిహితులు అంగీకరిస్తుండటం గమనార్హం. ప్రొఫెషనల్‌ కిల్లర్‌గా తాము తర్ఫీదు ఇచ్చిన శ్రీనివాసరావును విమానాశ్రయం రెస్టారెంట్‌లో చెఫ్‌గా చేర్చారు. కోడి పందేలలో ఉపయోగించే కత్తి అత్యంత పదునుగా ఉంటుంది. ఆ కత్తి గొంతులోకి దించితే క్షణాల్లో ప్రాణం పోతుందని పోలీసు అధికారులే చెబుతున్నారు. పదునైన ఆ కత్తినే హత్యకు ఆయుధంగా ఎంచుకుని.. శ్రీనివాసరావుతో కలిపి పలు మార్లు రెక్కీ నిర్వహింపజేసి గురువారం ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హత్యాయత్నానికి తెగబడ్డారు. తన గొంతుపై దాడి చేసేందుకు శ్రీనివాసరావు చేస్తున్న యత్నాన్ని పసిగట్టి చాకచక్యంగా తప్పించుకోవడంతో.. తీవ్ర గాయంతో ప్రాణపాయం నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయటపడ్డారు. 

కేసును నీరుగార్చే యత్నం..
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారన్న సమాచారం క్షణాల్లో సీఎం చంద్రబాబుకు, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు చేరింది. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం వివరాలను గంటలోపే తేల్చుతామని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప ప్రకటించారు. కానీ.. ఆ తర్వాత కొద్ది నిముషాల్లోనే డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ మీడియా ముందుకొచ్చారు. కనీసం విచారణ ప్రాథమిక దశ కూడా దాటకముందే ‘ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిపై ఆయన అభిమాని దాడి చేశారు. ఇది చిన్న సంఘటన. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. కత్తిని.. తొమ్మిదో పదో పేజీల లేఖను స్వాధీనం చేసుకున్నాం’ అంటూ తేల్చడం ద్వారా ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం కేసును ఆదిలోనే సర్కారు నీరుగార్చేందుకు ప్రయత్నించిందనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి.  

శ్రీనివాసరావు నుంచి స్వాధీనం చేసుకున్న 11 పేజీల లేఖలోనిందితుడితోసహా మరో ఇద్దరి చేతిరాతలున్నట్లు తేల్చడం గమనార్హం. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి తన ఆవేదనను బహిర్గతం చేయడం కోసం లేఖ రాసుకుంటారని.. కానీ ప్రతిపక్ష నేతపై హత్య చేయడానికి తెగబడిన శ్రీనివాసరావు లేఖ రాసుకోవడంపై పోలీసు అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేసును నీరుగార్చడానికే ఈ లేఖను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. శ్రీనివాసరావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుడని చిత్రీకరించడానికి సర్కారు చేసిన ‘ఫ్లెక్సీ’ విన్యాసాలను పరిశీలిస్తే.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును నీరుగార్చడానికే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా కనికట్టు చేస్తున్నారని రిటైర్డు డీజీపీ ఒకరు వ్యాఖ్యానించారు. గురువారం సర్కారు విడుదల చేసిన ఫ్లెక్సీకి.. శుక్రవారం సిట్‌ వెలికితీసిన ఫ్లెక్సీకి ఏమాత్రం సంబంధం లేకపోవడాన్ని ఆయన ఎత్తిచూపడం గమనార్హం. 

మరిన్ని వార్తలు