ఎవరు చేస్తున్నారబ్బా..?

10 Jul, 2020 06:31 IST|Sakshi

నగరంలో వరుసగా కిడ్నాప్‌లు 

పోలీసులకు సవాల్‌గా మారిన రెండు కేసులు 

ఒక్కో కేసులో అనేక అనుమానాలు 

అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు 

దొండపర్తి (విశాఖ దక్షిణ): నగరంలో వరుస కిడ్నాప్‌ కేసులు పోలీసులకు సవాలు విసురుతున్నాయి. రెండూ కూడా ఒకే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నగర నడిరోడ్డున జరగడం ఖాకీలకు తలనొప్పిగా మారింది. ఆ రెండు కేసుల విషయంలో ఇప్పటి వరకు పురోగతి లభించకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా కిడ్నాప్‌ ప్రయత్నాలు జరిగాయా..? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నాలుగు రోజుల క్రితం దొండపర్తి ప్రాంతంలో ఫ్లై ఓవర్‌ కింద రియల్‌ఎస్టేట్‌ వ్యాపారితోపాటు న్యాయవాదిని కొంత మంది దుండగులు కారులో కిడ్నాప్‌ చేసేందుకు ప్రయతి్నంచిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద లతితా జ్యుయలరీస్‌ ఎదురుగా పెట్రోల్‌ బంక్‌ వద్ద ఒక ఫైనాన్స్‌ వ్యాపారిని బుధవారం కిడ్నాప్‌ చేసి అతని వద్ద ఉన్న నగదు, బంగారం దోచుకొని హత్యాయత్నం చేసి సాగర్‌నగర్‌ వద్ద పడేసిన విషయం తెలిసిందే. ఈ రెండు కిడ్నాప్‌ వ్యవహారాలు ద్వారకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే జరిగాయి. సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో బాధితులకు ప్రాణాపాయం తప్పింది. కిడ్నాపర్ల చెర నుంచి సురక్షితంగా బయట పడగలిగారు.  

కొలిక్కిరాని కేసులు 
సంఘటనలు జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క కేసులోనూ పురోగతి లభించలేదు. అలాగే సంఘటనలకు సంబంధించి సమాచారం, దర్యాప్తు విషయాలపై పోలీసులు కొంత గోప్యత పాటిస్తుండడం గమనార్హం. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కిడ్నాప్‌ వ్యవహారంలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ.. అందులో వాస్తవాలను పోలీసులు బహిర్గతం చేయడం లేదు. కిడ్నాప్‌నకు గురైన ఇద్దరు కూడా పోలీసులకు పూర్తిస్థాయిలో సమాచారం అందించలేకపోవడంతో కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసును ఛేదించడానికి ప్రయతి్నస్తున్నారు. అలాగే ఫైనాన్స్‌ వ్యాపారి అప్పలరాజు కిడ్నాప్, హత్యాయత్నం విషయంలో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కిడ్నాపర్ల దాడిలో గాయపడిన వ్యాపారి నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. అలాగే పెట్రోల్‌ బంక్‌ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా కిడ్నాపర్లు ఏయే ప్రాంతాల నుంచి తీసుకెళ్లారన్న విషయాన్ని తెలుసుకొని ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు కేసులకు సంబంధించి ఇప్పటి వరకు ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. నిజంగా కిడ్నాప్‌ ప్రయత్నాలు జరిగాయా? అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ రెండు కేసుల వ్యవహారాలను ఛేదించాలని పోలీసులు గట్టి పట్టుదలతో ఉన్నారు.    

మరిన్ని వార్తలు