అడవిలో పోరాడి.. జీవితంలో ఓడి..!

16 Dec, 2017 11:06 IST|Sakshi

మావోయిస్టు మాజీ నేత గోపన్న ఆత్మహత్య

రైలు కిందపడి బలవన్మరణం

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో మోసమే కారణం..!

అగ్రిమెంట్‌ చేసుకున్న వారికి డబ్బులు ఇస్తానని మెస్సేజ్‌

 పరువు పోతుందని ఆందోళన 

 రైలుకు ఎదురెళ్లి బలవన్మరణం 

 ఉనికిచర్ల రైల్వేగేట్‌ వద్ద ఘటన 

మావోయిస్టు మాజీ నేత కోమళ్ల శేషగిరిరావు అలియాస్‌ గోపన్న(51) శుక్రవారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మావోయిస్టు ఉద్యమంలో ఆంధ్రా, ఒడిషా (ఏఓబీ) రాష్ట్రనేతగా పనిచేసి కొన్నేళ్ల క్రితం ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో జరిగిన మోసాలతో  ధర్మసాగర్‌ మండలం ఉనికిచర్ల శివారులో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

సాక్షి, భీమారం/కాజీపేట: మావోయిస్టు ఉద్యమానికి కీలకమైన ఏఓబీలో రాష్ట్ర నేతగా పని చేసి, అడవిలో అనేక దాడులకు నేతృత్వం వహించి పోలీసులకు లొంగిపోయిన మావో యిస్టు మాజీ అగ్రనేత కోమళ్ల శేషగిరిరావు అలియాస్‌  గోపన్న(51).. తర్వాతి జీవితంలో మాత్రం ఓడిపోయాడు. రియల్‌ ఎస్టేట్‌లో జరిగి న మోసం.. ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు గురై రైలుకు  ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఈ ఘటన కాజీపేట–హసన్‌పర్తి రైల్వేస్టేషన్ల మధ్య ఉనికిచర్ల గేట్‌ వద్ద శుక్రవారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథ నం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూ రు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గోపన్న హన్మకొండ గోపాలపురంలోని  వివేక్‌నగర్‌లో భార్య  మంజుల అలియాస్‌ భారతి, కూతురు సుమశ్రీతో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో  ఉదయం ఆయనఇంటి నుంచి కారులో బయటికి వచ్చాడు. అంతకు ముందు ఇంటి కి సమీపంలో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి వెళ్లి కొద్దిసేపు ఉన్నాడు. 

తర్వాత కారులో వడ్డేపల్లి చర్చి క్రాస్‌ వద్దకు చేరుకుని అక్కడ కొద్దిసేపు తిరిగాడు. కారు డ్రైవర్‌ను ఇంటికి వెళ్లమని చెప్పి తాను రైల్వేట్రాక్‌ బాటపట్టాడు. దీం తో డ్రైవర్‌ కొంతదూరం వచ్చి.. గోపన్న మిత్రుడు చందర్‌కు ఫోన్‌ చేసి.. సమాచారమిచ్చాడు. చందర్‌ వెంటనే బైక్‌పై అటువైపు వెళ్లగా అప్పటికే గోపన్న రైల్వే ట్రాక్‌పైకి చేరుకొని 12.20 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్‌ నుంచి దానాపూర్‌(పాట్నా) వెళ్లే ధానా పూర్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిం చారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించగా సాయంత్రం పోస్టుమార్టం పూర్తి చేశారు. 

రాజమండ్రి భూవివాదంతోనే ఆర్థిక ఇబ్బందుల్లోకి.. 
ఆం«ధ్రప్రదేశ్‌ రాష్ట్రం రాజమండ్రిలోని ఓ జమీందార్‌కు చెందిన సుమారు 135 ఎకరాల భూమి ని తాను కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్‌ చేసుకున్నానని హైదరాబాద్‌కు చెందిన ఓ రియల్టర్‌ గోపన్నను నమ్మించాడు. అసలు భూయజమానితో తాను ఈ భూమి రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని గోపన్న దగ్గర కొంత నగదు తీసుకొని అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. తర్వాత అదే భూమి ని గోపన్న రాజమండ్రికి చెందిన బిల్డర్‌ సుబ్బారెడ్డికి అమ్మేందుకు అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. 

ఈ క్రమంలో ఆ భూమిపై వివాదం ఏర్పడింది. హైదరాబాద్‌కు చెందిన రియల్టర్‌ తనను మో సం చేసినట్లు గోపన్న ఆలస్యంగా గుర్తించాడు. అదే సమయంలో అగ్రిమెంట్‌ చేసుకున్న సుబ్బారెడ్డి మాత్రం భూమి తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని ఒత్తిడి పెంచాడు. రెండుసార్లు గోపన్న రిజిస్ట్రేషన్‌కు సమయం ఇచ్చి రాలేదని సుబ్బారెడ్డి తెలిపాడు. సుబ్బారెడ్డి ఒత్తిడి పెంచడంతో అదే భూమిని గోపన్న డబ్బుల కోసం మరో రియల్టర్‌తో అగ్రిమెంట్‌ చేసుకున్నట్లు తెలిసింది. 

అగ్రిమెంట్‌లో గోపన్నకు మోసం..
హైదరాబాద్‌కు చెందిన రియల్టర్‌ అగ్రిమెంట్‌లో మోసం చేసినట్లు గోపన్న గుర్తించారు. అగ్రిమెంట్‌ ఇచ్చిన వారు  హైదరాబాద్‌కు చెందిన ఓ బలమైన రాజకీయ వర్గానికి చెందిన వారని తెలిసింది. గోపన్న ఏదైతే భూమి అగ్రిమెంట్‌ చేసుకున్నాడో దానిని అమ్మకానికి ఎవరితోనూ తాను ఒప్పందం చేసుకోలేదని భూమి యజ మానురాలు వెల్లడించడంతో అసలు విషయం బహిర్గతమైనట్లు తెలిసింది.

గతేడాది గోపన్న కిడ్నాప్‌.. దాడి.. 
ఇదిలా ఉండగా రిజిస్ట్రేషన్‌ చేయడానికి గోపన్న గతేడాది రాజమండ్రికి వెళ్లారు. అక్కడ  గోపన్న కిడ్నాప్‌నకు గురయ్యారు. మూడు రోజులపాటు గోపన్ననను అపహరించి, కిడ్నాపర్లు ఆయనను తీవ్రంగా గాయపరిచారు. చావు బతుకుల మధ్య గోపన్న ఇంటికి చేరుకున్నాడు.  

డబ్బుల కోసం ఒత్తిడి..
గోపన్నకు డబ్బులు ఇచ్చిన రియల్టర్‌ సుబ్బారెడ్డి డబ్బులు ఇవ్వమని గోపన్నపై ఒత్తిడి పెం చాడు. దీంతో గోపన్న సదరు వ్యక్తికి 15న డబ్బులు ఇస్తానని మెస్సేజ్‌ పంపారు. మెస్సెజ్‌ ప్ర కారం రియల్టర్‌ తన డబ్బులు తీసుకునేందుకు హన్మకొండకు వచ్చాడు. అయితే డబ్బులు సమకూరకపోవడంతో ఆయన ఆందోళనకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. 

కేటీఆర్‌ ముందు మొర..
రాజమండ్రిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో హైదరాబాద్‌ రియల్టర్‌ తనకు చేసిన మోసాన్ని మంత్రి కేటీఆర్‌ ముందు గోపన్న మొరపెట్టుకున్నట్లు తెలిసింది. రాజమండ్రికి చెందిన ఓ ఎమ్మెల్యే ఫోన్‌లో బెదిరింపులకు గురిచేస్తున్న విషయాన్ని కూడా గోపన్న ఆయనకు వివరించారని సమీప బంధువులు పేర్కొన్నారు.

అడవిలో ఉన్నప్పుడు బతికితివి కాదే అన్న
అడవిలో ఉన్నప్పుడే బతికితివి కాదే అన్న.. నిన్ను ఎలా చూడాలే అన్న.. అడివిలో కాపాడిన దేవుడు.. ఇప్పుడు ఏటూ పోయిండే అన్న.. నీ బిడ్డకు దిక్కేవరే అన్న.. అంటూ గోపన్న మృతదేహంపై ఆయన సోదరి పద్మ విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది.

కూతురంటే మహాప్రాణం..
గోపన్న, మంజుల పెంపుడు కూతురు సుమశ్రీ అంటే గోపన్నకు ఎంతో ప్రేమ. నిత్యం సుమ.. సుమ అని పిలిచేవాడు. సుమశ్రీ ఎస్‌ఆర్‌ స్పా ర్కిల్‌ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. గోపన్న తండ్రి ధర్మారావు మూడేళ్ల క్రితం, తల్లి సావిత్రి ఐదేళ్ల కిత్రం చనిపోయారు.

సంఘటన స్థలానికి ఎర్రబెల్లి, జంగా
సమాచారం అందుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీసీసీబీ మాజీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి చేరుకొని పట్టాలపై చెల్లాచెదురైన శరీరవయవాలను పరిశీలించారు.

మృతదేహం వద్ద సూసైడ్‌ నోట్‌.. 
మిత్రులారా దయచేసి క్షమించండి.. నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి.. నా కూతురు, భార్య గురించి ఆలోచించండి. కుటుంబ సభ్యులారా తప్పు చేశాను. నమ్మి మోసపోయాను. నా కుటుంబాన్ని దిక్కులేకుండా చేసి పోతున్నాను. తల్లీ క్షమించు బిడ్డా.. అమ్మను బాధపెట్టకు. అమ్మ అమాయకురాలు.. న్యక్షా లవ్‌ యూ, మిస్‌ యూ.. నిన్ను కష్టపెట్టి ఉంటే క్షమించు. ఒక మనిషి ఎంత ఎదగగలడో.. ఎంత దిగజారగలడో నా జీవితం ఉదాహరణ. ఒక్క నిమిషం వీడక బతకాలనుకున్నాను. కానీ ఈ సాయంత్రం నేను ఇంకా మాటలు పడుతాను. ఆర్థికంగా నష్టపోయాను’ అని నోట్‌లో పేర్కొన్నాడు.

నేడు శివముక్తిధామంలో అంత్యక్రియలు
వరంగల్‌ క్రైం: మావోయిస్టు మాజీ అగ్రనేత కోమళ్ల శేషగిరిరావు అలియాస్‌ గోపన్న ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. హన్మకొండ పద్మక్షి కాలనీలోని శివముక్తిధామంలో శనివారం ఉదయం 10 గంటలకు గోపన్న అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు.

   

మరిన్ని వార్తలు