మూడు రోజులుగా మాటు!

26 Sep, 2018 03:32 IST|Sakshi
ఆదివారం లివిటిపుట్టు వద్ద కిడారి సర్వేశ్వరరావు వాహనాన్ని చుట్టుముట్టిన మావోలు

లివిటిపుట్టుకు భారీగా వచ్చిన మావోయిస్టు దళాలు

ఘటన అనంతరం అటవీ మార్గంలో ఒడిశాకు వెళ్లిన వైనం

అరకులోయ: ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును టార్గెట్‌గా చేసుకున్న మావోయిస్టులు మూడు రోజులుగా కండ్రూం పంచాయతీ సమీపంలోని అడవుల్లో మాటు వేసినట్టు తెలిసింది. కొందరు సాధారణ దుస్తులు ధరించి ఎలాంటి ఆయుధాలు లేకుండా ఈ ప్రాంతంలో సంచరించారని సమాచారం.

కాలినడకన మూడు చోట్ల నుంచి..
ఆపరేషన్‌ లివిటిపుట్టులో పాల్గొనేందుకు ఏవోబీలోని మూడు ప్రాంతాల నుంచి మావోయిస్టులు భారీగా చేరుకున్నారు. ఏజెన్సీలో కీలకమైన పెదబయలు దళంతోపాటు ఒడిశా కటాఫ్‌ ఏరియాలోని ఏరియా కమిటీ, కొరాపుట్‌ జిల్లా నందపూర్‌ దళానికి చెందిన మావోయిస్టులంతా కాలినడకనే లివిటిపుట్టుకి ముందుగానే చేరుకున్నట్టు తెలిసింది. సాధారణంగా ప్రతి దళంలోనూ 20 మందికి మించి మావోయిస్టులు ఉండరు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమల వాహనాలను చుట్టుముట్టినపప్పుడు మావోయిస్టులు భారీగా ఉన్నారు. కొందరు ఘటనా స్థలంలో ఉండగా మరికొందరు సమీపంలోని అటవీ ప్రాంతంలో మాటు వేసినట్టు చెబుతున్నారు. వీరిని హతమార్చిన తర్వాత మళ్లీ అడవి మార్గంలోనే ఒడిశా ప్రాంతానికి తరలి వెళ్లినట్టు గిరిజనులు పేర్కొంటున్నారు. 

వెంటనే స్పందించని యంత్రాంగం
డుంబ్రిగుడ మండలంలోని మారుమూల ప్రాంతం గుంటసీమ తరువాత ఒడిశా గ్రామాలే అధికంగా ఉన్నాయి. ఒడిశా మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం కావడంతో సులభంగా తప్పించుకునే అవకాశం కలిగింది. ఘటన తరువాత ఒడిశాలోని కోరాపుట్, విశాఖ జిల్లాల్లోని పోలీసు యంత్రాంగం సకాలంలో స్పందించలేదు. మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో హత్యలు జరిగిన తరువాత మావోయిస్టులు సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు కొంత సమయం పట్టింది. అయితే పోలీసు యంత్రాంగం నుంచి ప్రతిస్పందన లేకపోవడం మావోయిస్టులకు కలిసొచ్చింది. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ప్రకటించినప్పటికీ డుంబ్రిగుడ, ఒడిశా సరిహద్దులో పోలీసుల సంచారం కనిపించడం లేదు.

ఎమ్మెల్యే కదలికలపై వివరాల సేకరణ...
లివిటిపుట్టు ప్రాంతంలో కొన్నిచోట్ల సెల్‌ఫోన్‌ సంకేతాలు అందుబాటులో ఉన్నాయి. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ కూండ్రం పంచాయతీ సర్రాయి గ్రామానికి వస్తున్న సమాచారాన్ని మావోయిస్టులు ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్ల ద్వారా తెలుసున్నారు. 

జవాన్‌ పోస్టుల రాత పరీక్షలో పోలీసులు బిజీ
జవాన్‌ పోస్టుల భర్తీకి సంబంధించి గిరిజన అభ్యర్ధుల కోసం పోలీసుశాఖ ఆదివారం అరకులోయలో మెరిట్‌ టెస్ట్‌ ఏర్పాటు చేసింది. పోలీసులు ఈ పనుల్లో నిమగ్నమవుతారని, డుంబ్రిగుడ వైపు రాలేరని  మావోలు లివిటి అపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. కాగా, మావోయిస్టులు ఈ ప్రాంతంలో సంచరిస్తూ మాటు వేశారనే సమాచారం బయటకు పొక్కకపోవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు