మావోయిస్టు అగ్రనేత రామన్న మృతి

18 Dec, 2019 08:23 IST|Sakshi

సుకుమా జిల్లాలో అంత్యక్రియలు

నివాళులర్పించిన దళం సభ్యులు

మృతుడిపై రూ.1.40 కోట్ల రివార్డు

మల్కన్‌గిరి: జిల్లా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టు అగ్రనేత రామన్న గుండెపోటుతో సోమవారం సాయంత్రం మృతిచెందారు. 2003 నుంచి 2007 వరకు మల్కన్‌గిరి జిల్లాలోని కలిమెల, చిత్రకొండ, కటాఫ్‌ ఏరియాలో అగ్రనేతగా పనిచేసిన రామన్న పలు హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయా ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఇప్పటివరకు అతడి ఆచూకీ పోలీసులకు లభ్యం కాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో అతడిని అప్పగించిన వారికి రూ.1.40 కోట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన కూడా జారీ చేసింది. అయినా అతడు పోలీసుల కంట పడకుండా తన కార్యకలాపాలను కొనసాగించడం గమనార్హం.

ఇదిలా ఉండగా, సుకుమా జిల్లాలోనే రామన్న అంత్యక్రియలను మావోయిస్టు దళ సభ్యులు మంగళవారం నిర్వహించారు. అతడి మృతదేహంపై విప్లవ సూచికలైన ఎర్రటి వస్త్రాలను కప్పి, విప్లవగీతాలు ఆలపిస్తూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామన్న సేవలను పలువురు దళం సభ్యులు కొనియాడారు. సుమారు 60 ఏళ్ల వయసు కలిగిన రామన్న దళంలో చాలా చురుకుగా ఉండేవారని, అతడి సహచరులు చెబుతున్నారు. దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడు చనిపోవడం చాలా బాధాకరంగా ఉందని, అతడి మృతి మావోయిస్టుల ఉద్యమానికి తీరని లోటు అని మావోయిస్టు దళ సభ్యులు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు