మావోయిస్టుల లొంగుబాటు

24 Jul, 2018 13:02 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, వెనుక లొంగిపోయిన మావోయిస్టులు, మిలీషియా సభ్యులు

లొంగిపోయిన వారిలో ఇద్దరు దళ, నలుగురు మిలీషియా సభ్యులు

ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ వెల్లడి

పెదవాల్తేరు(విశాఖతూర్పు):  మావోయిస్టులు ఇద్దరు, మిలీషియా సభ్యులు నలుగురు లొంగిపోయినట్టు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ తెలిపారు.  పెదవాల్తేరులో గల ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెదబయలు మండలం బురికిపనస గ్రామానికి చెందిన తాంబేలు లక్ష్మి ఇâష్టంలేని పెళ్లి కారణంగా ఇంటి నుంచి బయటకు వచ్చి, పెదబయలు దళం నాయకుల మాటలకు ఆకర్షితులై 2014లో మావోయిస్టులలో చేరిందన్నారు. 2016 వరకు దళంలో పనిచేసిందని చెప్పారు. ఈమె కిల్లంకోట వద్ద బాలకృష్ణ హత్య కేసు, ఎగువవలస పల్లి గ్రామంలో కరువుదాడి, వాకపల్లి వద్ద రోడ్డు యంత్రాల దహనం, బూసిపుట్టులోపాంగి రామయ్య, జి.మాడుగుల పరిధిలో ఎం.సత్యారావుల హత్య కేసులతో సంబంధం ఉందని చెప్పారు. 

ఇష్టంలేని పెళ్లి కారణంగా జి.మాడుగుల మండలం గూనలోవకు చెందిన పాంగి శీలు అలియాస్‌ లత పెదబయలు దళం సభ్యురాలిగా చేరిందన్నారు. ఈమె 2014 నుంచి 2015 వరకు దళంలో పనిచేసిందని తెలిపారు. కిల్లంకోట వద్ద బాలకృష్ణ హత్యకేసు, ఒడిశాలో కరువుదాడి, బూసిపుట్టు వద్ద బ్యాలెట్‌బాక్సుల చోరీ, వాకపల్లిలో రోడ్డు యంత్రాల దహనం, చెరువూరు వద్ద ఎస్‌ఆర్‌ పైప్‌లైన్‌ దహనం కేసులతో సంబంధం ఉందన్నారు. మిలీషియా సభ్యుల్లో చింతపల్లి మండలానికి చెందిన మండేపల్లి రామకృష్ణ, గెమ్మిలి కొండబాబు, పూజారి సింహాచలం, గుంట ఆనందరావు  లొంగిపోయిన వారిలో ఉన్నారని చెప్పారు. వీరికి కాఫీ తోటల పంపకం, కాఫీ గొడౌన్ల దహనం, కరువు దాడులు, పోస్టర్ల, కరపత్రాల తయారీ, గెమ్మిలి సంజీవరావు హత్య, గొంపలోవ శ్రీను హత్య తదితర కేసులతో  సంబంధం ఉందన్నారు.   మావోయిస్టులు, మిలీషియా సభ్యులంతా స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ప్రభుత్వం కల్పించే అన్ని సదుపాయాలు అందజేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో సీఆర్‌పీఎఫ్‌ 234 బెటాలియన్‌ కమాండెంట్‌ కసంఖాన్, 198 బెటాలియన్‌ డెప్యూటీ కమాండెంట్‌ అనిల్‌ప్రసాద్‌ తదితరులు
పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు