ఇంట్లోనే గంజాయి సాగు!

16 Aug, 2018 04:35 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్క, చిత్రంలో నిందితుడు ప్రణవ్‌

     పూల మొక్కల కుండీల్లో..గంజాయి మొక్కలు  

     నగరవాసిని అరెస్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు.. 

     అమెజాన్‌లో ఉద్యోగం..గంజాయి వ్యాపారం

సాక్షి, హైదరాబాద్‌: అక్కడా ఇక్కడా ఎందుకని.. నగరంలోని ఓ వ్యక్తి ఏకంగా ఇంటిలోనే గంజాయి సాగు చేశాడు.. పూల మొక్కల మాదిరిగా.. కుండీల్లో గంజాయి మొక్కలను పెంచాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అబ్కారీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు  ఇతని గుట్టును రట్టు చేశారు.  టోలిచౌకి పారామౌంట్‌ వీర్‌ స్ట్రీట్‌లో ఉన్న నవాజ్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ప్రణవ్‌(24) అమెజాన్‌లో సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను నగరంలోని పలువురు వ్యాపారవేత్తలు, వీఐపీల పిల్లలకు విక్రయిస్తున్నాడు. రహస్యంగా ఉండటం కోసం ఇంట్లోనే గంజాయి సాగు చేపట్టాడు. ప్రణవ్‌ ఇంట్లో గంజాయి మొక్క ఉన్న పూల కుండీని.. కవర్‌లో ప్యాక్‌ చేసిన ఎండిన గంజాయి మొక్కను, అతని బైక్‌లో ఉన్న 75 ప్యాకెట్ల ఎల్‌ఎస్‌డీ(లిసర్జిక్‌ ఆసిడ్‌ డై ఇథలమైడ్‌), 8 గ్రాముల ఎండీఎంఏ, 180 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతను హైటెక్‌ పద్ధతిలో మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నట్లు నిర్ధారించారు.

డ్రీమ్‌ మార్కెట్‌ వెబ్‌సైట్, బిట్‌కాయిన్స్‌ ద్వారా నగదు చెల్లించిన వారికి గంజాయిని కొరియర్‌ ద్వారా సరఫరా చేసినట్లు గుర్తించారు. ఇప్పటివరకు ఎంతమందికి ఇలా అమ్మాడన్న దానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. దీని కోసం అతని మొబైల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్యే ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌ (యాంటీ నార్కోటిక్‌) బృందం జరిపిన సోదాల్లో చింతల్‌బస్తీలో నివాసం ఉంటున్న ఆదిలాబాద్‌వాసి అబ్దుల్‌ హమీద్‌ వద్ద 31 గ్రాముల కొకైన్‌ పట్టుబడింది. ఈ కేసు తదుపరి విచారణను జూబ్లీహిల్స్‌ పోలీసులకు అప్పజెప్పారు. అబ్దుల్, ప్రణవ్‌ల నుంచి పలువురు మాదకద్రవ్యాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. వీరిలో బడా వ్యాపార వేత్తలు, వీఐపీల పిల్లలున్నట్లు సమాచారం. వీరందరికీ నోటీసు లు జారీ చేసి విచారణ జరపాలని ఆబ్కారీ శాఖ నిర్ణయించింది. ఎన్‌ఫోర్స్‌ విభాగం ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న అక్రమార్కులపై ఉక్కు పాదం మోపుతామని నగర ఎక్సైజ్‌ విభాగం డిప్యూటీ కమిషనర్‌ సి. వివేకానందరెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఏఈఎస్‌ ఎన్‌.అంజిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.  

మరిన్ని వార్తలు