72 కిలోల గంజాయి స్వాధీనం

11 Jan, 2019 08:25 IST|Sakshi
పట్టుబడిన గంజాయి, కారుతో ఎక్సైజ్‌ పోలీసులు

పోలీసుల నుంచి తప్పించుకోబోయి

 పాన్‌షాపును ఢీ కొన్న గంజాయి కారు ముగ్గురి అరెస్టు

విశాఖపట్నం, బుచ్చెయ్యపేట(చోడవరం): గంజాయిని తరలిస్తూ పోలీసులను తప్పించుకునే ప్రయత్నంలో ఓ కారు రోడ్డు పక్కన ఉన్న కిల్లీబడ్డీని ఢీ కొంది. ఆ కారు నుంచి 72 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.కె.వి.వి. ప్రసాద్‌  వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం పాడేరు నుంచి బుచ్చెయ్యపేట వైపు వెళ్తున్న కారులో గంజాయి ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో మాడుగుల మండలం ముకుందపురం నుంచి టాస్క్‌పోర్స్‌ పోలీసులు ఆ కారును వెంబడిస్తూ వచ్చారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిందితులు కారును వేగంగా నడిపారు. వడ్డాది నాలుగురోడ్ల జంక్షన్‌లో  ఎదురుగా వస్తున్న వాహనా న్ని తప్పించే ప్రయత్నంలో  రోడ్డు పక్క న ఉన్న కిల్లీషాపును ఢీ కొట్టారు. స్థానికులు  గుమిగూడడంతో వారు ముందుక వెళ్లలేకపోయారు. పోలీసులు వచ్చి కారులో కేరళ రాష్ట్రం బల్టర్‌ జిల్లా మాలాపురానికి చెందిన నిందితులు మహామ్మద్‌ స్వలిహి, రఫీక్‌ పత్తార్, సలియన్‌ తామస్‌ను అరెస్టు చేశారు. 36 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ మూడు లక్షలు  ఉంటుందని   ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చెప్పారు. కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. సీఐ కె.కామేశ్వరరావు,ఎస్సైలు ఎస్‌.ధర్మారావు, రాజ్యలక్ష్మితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. కిల్లీషాపు పూర్తిగా ధ్వంసమైంది.  సంఘటన జరిగిన సమయంలో పాన్‌షాపు తెరిచి లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.   కిల్లీబడ్డీ యజమానికి రూ. 40 వేల నష్టం జరిగింది. 

మరిన్ని వార్తలు