గాజువాక టు హైదరాబాద్‌

17 May, 2019 08:56 IST|Sakshi
పోలీసుల కస్టడీలో గంజాయి నిందితులు

నగరంలో పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు

132 కిలోల గంజాయి, రూ.1.85 లక్షల నగదు, కారు స్వాధీనం

ఆరుగురు నిందితులను రిమాండ్‌ కు తరలింపు

ముఠాలో ఇద్దరు యువతులు వివరాలు వెల్లడించిన డీసీపీ ప్రకాష్‌రెడ్డి

అత్తాపూర్‌: ఆర్టీసీ బస్సులో గంజాయిని తరలిస్తున్న ముఠాను ఆరాంఘర్‌ చౌరస్తా వద్ద ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 132 కిలోల గంజాయి, రూ. 1.85 లక్షల నగదు, ఇండికా కారు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని విచారణ నిమిత్తం రాజేంద్రనగర్‌ పోలీసులకు అప్పగించారు. గురువారం డీసీపీ ప్రకాష్‌రెడ్డి, ఏసీపీ అశోక చక్రవర్తి నిందితుల వివరాలను వెల్లడించారు. ధూల్‌పేటకు చెందిన శుభంసింగ్‌ (24) విశాఖ జిల్లా గాజువాక నుంచి వెంకట్‌ అనే వ్యక్తితో గంజాయిని నగరానికి చేరుస్తుంటాడు. శుభంసింగ్‌కు వరుసకు తమ్ముడు సతీష్‌సింగ్‌ (30) ఎలక్ట్రిషన్, నల్లగొండకు చెందిన నరేష్‌ (29) ట్రాక్టర్‌ డ్రైవర్, నవీన్‌(19), ధూల్‌పేటకు చెందిన సునైనా(18), కార్వాన్‌కు చెందిన రోహినిదేవి(19) ముఠాగా ఏర్పడి జల్‌పల్లిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. విశాఖ జిల్లా గాజువాక నుంచి వచ్చిన గంజాయిని ప్యాకింగ్‌ మెషిన్ల సాయంతో 12 గ్రాముల ప్యాకెట్లను తయారు చేస్తుంటారు. తయారు చేసిన ప్యాకెట్లను నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. 

పక్కా సమాచారంతో..
గంజాయి సరఫరా జరుగుతున్నట్లుగా సమాచారం అందుకున్న శంషాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు ఆరాంఘర్‌ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. బస్సులో అనుమానాస్పదంగా కనిపించిన ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా అంగీకరించారు. దీంతో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా సభ్యుల నుంచి 132 కిలో గంజాయి, రూ. 1,85,240 నగదు, ఒక ఇండికా కారు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ ప్రకాష్‌రెడ్డి, ఏసీపీ అశోక్‌ చక్రవర్తిలు తెలిపారు. 

మరిన్ని వార్తలు