వైజాగ్‌ టు ముంబయి వయా ఇందూరు

14 Apr, 2018 13:22 IST|Sakshi
గంజాయిని దాచేందుకు లారీ క్యాబిన్‌లో ప్రత్యేక ఏర్పాటు

గంజాయి లారీ పట్టివేత

310 కిలోలు స్వాధీనం, ఒకరి అరెస్టు  

పరారీలో ప్రధాన సూత్రదారి, లారీ డ్రైవర్‌

పోలీసుల గాలింపు ముమ్మరం

నిజామాబాద్‌ క్రైం(నిజామాబాద్‌ అర్బన్‌): పోలీసులు, ఎక్సైజ్‌ శాఖ అధికారులు గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా జిల్లాలోకి వస్తూనే ఉంది. తాజాగా గంజాయి జిల్లాలో మరోసారి కలకలం సృష్టించింది. విచిత్రం ఏమంటే గంజా యి లారీ ఒకేచోట 10 రోజులుగా పార్క్‌ చేసి ఉండటం. ఈ లారీపై ఎవరికి అనుమానం రాకుం డా లారీ డ్రైవర్‌ క్యాబిన్‌లో గంజాయి దాచిపెట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండడం ఎవరికి అనుమానం రాలేదు. చివరికి అజ్ఞాతవాసి ఒకరు పోలీసులకు పక్కా సమాచారం ఇచ్చారు. దీంతో గంజాయి గుట్టు రట్టయ్యింది. ఈ సంఘటన వివరాలను సీపీ కార్తికేయ శుక్రవారం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో విలేకరులతో వెల్లడించారు. డిచ్‌పల్లి మండలం సుద్దులం గ్రామానికి చెందిన గజిబికర్‌ హుస్సేన్‌ బామ్మర్ది హైదరాబాద్‌ కూకట్‌పల్లికి చెందిన సుదర్శన్‌ గంజాయి స్మగ్లర్‌.

విశాఖపట్నం, శ్రీకాళుళం, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి తెచ్చి విశాఖపట్నం, విజయవాడ, నల్గొండ, నిజామాబాద్‌ జిల్లాల మీదుగా మహారాష్ట్రలోని ముంబయికి రవాణా చేస్తుంటాడు. ఇతడిపై పలు జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్లలో అనేక కేసులున్నాయి. అరెస్టు అయి జైల్‌శిక్ష అనుభవించినా అతడిలో మార్పు రాలేదు. 20 రోజుల క్రితం ఏపీ 24టీ 7299 నంబరు గల లారీలో గంజాయి తరలించేందుకు లారీడ్రైవర్‌ క్యాబిన్‌ను ప్రత్యేకంగా తయారు చేయించాడు. ఇందులో రెండు కిలోల చొప్పున గల 155 ప్యాకెట్లు 310 కిలోల గంజాయి నింపి విశాఖపట్నం నుంచి నిజామాబాద్‌కు పంపాడు. దీని విలువ సుమారు రూ.16 లక్షలుంటుంది. విశాఖపట్నం నుంచి నిజామాబాద్‌ వరకు మార్గమధ్యలో అనేక చెక్‌పోస్టు తనిఖీ కేంద్రాలు ఉన్నా ఎవరికి లారీలో గంజాయి ఉందన్న అనుమానం రాలేదు. చివరికి లారీ గత నెల 31న సుద్దులంలోని హుస్సేన్‌ ఇంటికి చేరుకుంది. అక్కడే లారీని 14రోజులు నిలిపి ఉంచారు. దాంతో అనుమానం వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఒకరు సీపీకి సమాచారమిచ్చారు. దీంతో సీపీ డిచ్‌పల్లి పోలీసులకు, టాస్క్‌ఫోర్సు పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు అక్కడ కు చేరుకుని లారీని స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం లారీని స్వాధీనం చేసుకున్నారు.

అనుమానం రాకుండా చర్యలు..
గంజాయి అక్రమ రవాణాలో ప్రధాన సూత్రదారి సుదర్శన్‌ 15 రోజుల క్రితం లారీని ఇక్కడకు పంపి తాను మాత్రం హైదరాబాద్‌లోనే ఉండిపోయాడు. సుద్దులం మారుమూల గ్రామం కావటం, ఇక్కడి గ్రామస్తులకు అనుమానం రా కుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన హుస్సేన్‌ గంజాయి రవాణా చేసినందుకు అతడికి డబ్బులు వస్తుండటంతో బామ్మర్ధి చేసే పనికి అడ్డు చెప్పలేదు. హుస్సేన్‌ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేసి 15 ప్యాకెట్ల గంజాయిని పట్టుకున్నారు. సుదర్శన్, లారీడ్రైవర్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్‌ బృందం హైదరాబాద్‌కు వెళ్లినట్లు సీపీ కార్తికేయ తెలిపారు. గంజాయి లారీని పట్టుకున్న డిచ్‌పల్లి సీఐ రామాంజనేయులు, ఎస్‌ఐ నవీన్‌కుమార్, టాస్క్‌ఫోర్సు సీఐ జగదీష్, చందర్‌రాథోడ్, పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు.

మునావర్‌ అలీపై పీడీ యాక్ట్‌..
గంజాయి స్మగ్లర్‌ నగరంలోని ఆటోనగర్‌కు చెందిన మునావర్‌ అలీపై పీడీ యా క్టు చట్టం కింద కేసు నమోదు చేశామని సీపీ కార్తికేయ తెలిపారు. 2017, 18లో మునావర్‌ అలీ గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డా డు. 2018 జనవరిలో మునావర్‌ నుంచి 100 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నామని, అతడిపై నిజామాబాద్‌లోనే కాకుండా వివిధ జిల్లాల పోలీస్‌స్టేషన్లలో గంజాయి స్మగ్లింగ్‌ కేసులు ఉన్నాయని, దాంతో అతడిపై పీడీ యాక్టు చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం మునావర్‌ జైల్‌లో ఉన్నట్లు సీపీ తెలిపారు.

మరిన్ని వార్తలు