గుప్పుమంటున్న గంజాయి!

8 Jun, 2020 13:04 IST|Sakshi
కమ్మర్‌పల్లి మండలంలోని ఓ గ్రామంలో హుక్కా ద్వారా గంజాయి సేవిస్తున్న బాలుడు (ఫైల్‌)

విచ్చలవిడిగా సాగుతున్న దందా

బానిసలవుతున్న యువత

పట్టించుకోని అధికారులు

నిజామాబాద్‌, మోర్తాడ్‌(బాల్కొండ): గంజాయి దందా జోరుగా సాగుతోంది. గంజాయి గ‘మ్మత్తు’కు అలవాటు పడిన యువత చిత్తవుతోంది. ఎక్కడో హైదరాబాద్‌ లాంటి పట్టణాల్లో కనిపించే హుక్కా సంస్కృతి పల్లెలకూ పాకింది. కొంత మంది యువకులు, విద్యార్థులు బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. హాసాకొత్తూర్, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, ఏర్గట్ల, తాళ్లరాంపూర్, వడ్యాట్, రామన్నపేట్, శెట్‌పల్లి, తిమ్మాపూర్, ఉప్లూర్‌ తదితర గ్రామాలలో కొన్ని నెలల నుంచి గంజాయి విక్రయాలు ఊపందుకున్నాయి. అయినా అటు ఎక్సైజ్‌ అధికారులు కానీ, ఇటు పోలీసులు గానీ పెద్దగా పట్టించుకున్న దాఖలాల్లేవు.

యువతను టార్గెట్‌గా చేసుకుని కొందరు అక్రమార్కులు గంజాయి దందాను కొనసాగిస్తున్నారు. సిగరేట్లలో తంబాకును తొలగించి గంజాయి మిశ్రమాన్ని కలిపి విక్రయిస్తున్నారు. పోచంపాడ్, కోరుట్ల తదితర ప్రాంతాల నుంచి గంజాయి మిశ్రమం గల సిగరేట్లు దిగుమతి అవుతున్నాయని తెలుస్తుంది. ఒక్కో సిగరేట్‌ను రూ.150 నుంచి రూ.200లకు విక్రయిస్తున్నారు. ఇవే కాకుండా విడిగా గంజాయిని విక్రయిస్తున్నట్లు తెలిసింది. గంజాయికి అలవాటు పడుతున్న వారిలో యువకులతో పాటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు సైతంఉంటున్నారు. ఒకరిని చూసి ఒకరు అలవాటు చేసుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఠాలు కడుతున్న యువకులు, విద్యార్థులు.. గంజాయి మత్తులో ఇతరులతో ఘర్షణలకు దిగుతున్నారు. ఇలాంటి ఘర్షణలు ఇటీవల రెండు, మూడు చోట్ల జరిగాయి. గంజాయికి బానిసలైన యువకులు దొరికితే పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించేస్తున్నారు. అయితే, గంజాయి ఎక్కడి నుంచి వస్తుందనేది మాత్రం వారు గుర్తించలేక పోతున్నారు. గంజాయి స్మగ్లర్లకు రాజకీయ నేతల అండదండలు ఉండటం వల్లనే దందా యథేచ్ఛగా సాగుతోందని సమాచారం. 

సమాచారమివ్వాలి..
గంజాయిని విక్రయించే స్మగ్లర్ల కోసం ఆరా తీస్తున్నాం. స్మగ్లర్ల గురించి ఎవరైనా సమాచారం ఇస్తే వారి వివరాలను రహస్యంగా ఉంచుతాం. పోలీసులకు సహకరించి గంజాయి విక్రయాల వివరాలను అందించాలి.– సంపత్‌కుమార్, ఎస్‌ఐ, మోర్తాడ్‌ 

మరిన్ని వార్తలు