పాడేరు టు తమిళనాడు

20 Feb, 2020 12:21 IST|Sakshi
మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి, పక్కన ఇన్‌స్పెక్టర్‌ మధుబాబు, ఎస్సై రవినాయక్‌

గంజాయి అక్రమరవాణా కేసులో ఇద్దరు మహిళల అరెస్ట్‌

రూ.2.50 లక్షలు విలువచేసే గంజాయి స్వాధీనం

వివరాలు వెల్లడించిన నెల్లూరు డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి  

నెల్లూరు(క్రైమ్‌): విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు నుంచి తమిళనాడుకు గంజాయి అక్రమరవాణా చేస్తున్న ఇద్దరు మహిళలను నెల్లూరులోని చిన్నబజారు పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.2.50 లక్షల విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి వివరాలను వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా ఉత్తమపాళ్యం తేవారం గ్రామానికి చెందిన తంగమాయన్‌ మణిమాల కొంతకాలంగా విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి తమిళనాడుకు తరలించేది. అక్కడ అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోసాగింది. పాడేరు, చోడవరం పోలీసులు గతంలో ఆమెను అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. కొంతకాలం క్రితం ఆమెను నెల్లూరు రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 15 రోజుల క్రితం కండీషన్‌ బెయిల్‌ (ప్రతి గురువారం నెల్లూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో హాజరవ్వాలి)పై ఆమె జైలు నుంచి విడుదలైంది.

వియ్యంకురాలితో కలిసి..
పలుమార్లు జైలుకు వెళ్లినా మణిమాల ప్రవర్తనలో మార్పురాలేదు. ఈ నేపథ్యంలో ఆమె తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా ఉత్తమపాళ్యం కులంతేవర్‌కు చెందిన తన వియ్యంకురాలు జయపాల్‌ తమిళ్‌రాశితో కలిసి గంజాయి అక్రమరవాణా చేయసాగింది. అందులో భాగంగా వారు రెండురోజుల క్రితం పాడేరు దాని పరిసర ప్రాంతాల్లో రూ.2.20 లక్షలు విలువచేసే 22 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. వాటిని ఎవరికీ అనుమానం రాకుండా ప్యాక్‌ చేసి తమిళనాడుకు బయలుదేరారు. అయితే గురువారం కండిషన్‌ బెయిల్‌ నిమిత్తం నెల్లూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాల్సి ఉండడంతో తిరిగి తమ గ్రామం నుంచి రావడం కష్టం అవుతుందని మణిమాల భావించింది. నెల్లూరులో దిగి రెండురోజులు ఏదో ఒక లాడ్జిలో ఉండి గురువారం పోలీస్‌స్టేషన్‌లో హాజరై తిరిగి తమ గ్రామానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని మణిమాల తన వియ్యంకురాలికి తెలియజేసి ఇద్దరూ కలిసి ఈనెల 18వ తేదీ సాయంత్రం నెల్లూరుకు చేరుకున్నారు. మద్రాస్‌ బస్టాండ్‌లో ఓ హోటల్‌ సమీపంలో ఆటో కోసం వేచి ఉండగా వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందనే సమాచారం చిన్నబజారు ఇన్‌స్పెక్టర్‌ ఎం.మధుబాబుకు సమాచారం అందింది. దీంతో ఆయన తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్దనున్న బ్యాగుల్లో గంజాయిని గుర్తించారు. గంజాయి ప్యాకెట్లతోపాటు రెండు సెల్‌ఫోన్లు, రూ.1,450 నగదు స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిని విచారించి కేసు నమోదుచేసి అరెస్ట్‌ చేశామని డీఎస్పీ తెలిపారు.

సిబ్బందికి అభినందన
నిందితులను అరెస్ట్‌ చేసి పెద్దఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకునేందుకు కృషిచేసిన ఇన్‌స్పెక్టర్‌ మధుబాబు, ఎస్సై రవినాయక్, ఏఎస్సై శ్రీహరి, హెడ్‌కానిస్టేబుల్‌ భాస్కర్‌రెడ్డి, క్రైమ్‌ కానిస్టేబుల్‌ రాజా తదితరులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ ఎం.మధుబాబు, ఎస్సై రవినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు