భారీగా పట్టుబడిన గంజాయి

29 Apr, 2019 13:18 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న గంజాయి, నిందితుడిని చూపుతున్న పోలీసులు

281 కేజీల కలిగిన 125 ప్యాకెట్లు స్వాధీనం

వీటి విలువ రూ.14.06 లక్షలు

శ్రీకాకుళం , ఇచ్ఛాపురం/రూరల్‌: జాతీయ రహదారి–16 అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది. ఇప్పటికే పలుమార్లు గుట్కా, పాన్‌ వంటి నిషేధిత ఉత్పత్తులు పట్టుబడగా, తాజాగా రూ.14.06 లక్షల విలువైన 281 కేజీల కలిగిన 125 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. లొద్దపుట్టి కూడలి ధనరాజ్‌ తులసమ్మ అమ్మవారి ఆలయం వద్ద వాహనాల తనిఖీల్లో ఈ మొత్తం పట్టుబడింది. ఇక్కడ ఆలయం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సీఐ పైడపునాయుడు, రూరల్‌ ఎస్సై కోటేశ్వరరావు వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఇదేక్రమంలో విశాఖపట్నం నుంచి ఒడిశాలోని భువనేశ్వర్‌కు ఇన్నోవా(ఓఆర్‌05యూ5404) వాహనంలో గంజాయిని తరలిస్తున్నారు. ఇక్కడ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నట్లు గుర్తించి తమ వాహనాన్ని వదిలేసి దయో పరారీ అయ్యాడు. విభూమిభూషణ్‌ ప్రదాన్‌ను మాత్రం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ లెక్కించగా రూ.14.6 లక్షలు ఉంటుందని సీఐ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్‌ డీటీ గురుప్రసాద్, ఆర్‌ఐ కృష్ణప్రసాద్‌ రౌళో, సీతారామ్, పోలీస్‌ సిబ్బంది నీలకంఠం, చిరంజీవి, శాంతమూర్తి, రవి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు