గం‘జాయ్‌’గా రవాణా!

9 Mar, 2019 07:47 IST|Sakshi
పర్యాటకుల వాహనాలపై లగేజీ బ్యాగ్‌లు

పర్యాటకుల ముసుగులో అక్రమ తరలింపు ఒడిశా నుంచే అధికం

ప్రధాన రోడ్లలో తగ్గిన పోలీసుల తనిఖీలు రెచ్చిపోతున్న అక్రమార్కులు

అరకులోయ: అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పర్యాటకుల ముసుగులో గంజాయిని యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. ఏజెన్సీ మారుమూల గ్రామాలతో పాటు సరిహద్దు ఒడిశా ప్రాంతాల్లో  సాగైన గంజాయిని అరకు రోడ్డు మార్గంలో భారీగా తరలిస్తున్నారు. పాడేరు నుంచి అరకులోయ మీదుగా ఎస్‌.కోట రోడ్డు గంజాయి రవాణాకు అడ్డాగా మారింది. ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అరకులోయ వరకు రోడ్డు ఉండడంతో ఈ మార్గాన్ని గంజాయి వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పాడేరు, ఒడిశాల నుంచి అరకులోయకు పర్యాటకుల వాహనాలు నిరంతరం తిరుగుతుంటాయి. కుటుంబ సమేతంగా పర్యటనకు వచ్చినట్లు గంజాయి మాఫియా అధునాతన కార్లు, ఇతర వాహనాల్లో సంచరిస్తూ గంజాయిని మైదాన ప్రాంతాలకు తరలించి..సొమ్ము చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. గత ఏడాది డిసెంబర్‌ 10వ తేదీన హుకుంపేట మండలం సంతారి జంక్షన్‌ రోడ్డులో భార్యా భర్తలు, ఇతర కుటుంబసభ్యుల మాదిరిగా నలుగురు గంజాయిని కారులో తరలిస్తుండగా హుకుంపేట పోలీసులు పట్టుకున్నారు. గతంలోను ఇలాంటి అక్రమ గంజాయి రవాణా ఘటనలు వెలుగు  చూశాయి. ఒడిశా నుంచి గంజాయిని తరలించే వారంతా మాచ్‌ఖండ్‌ పర్యాటక ప్రాంతాలను సందర్శించే పర్యాటకుల్లాగా హల్‌చల్‌ చేస్తున్నారు. పాడేరు–అరకులోయ రోడ్డు నిత్యం పర్యాటకులతో కళకళాడుతుంది.  

జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లోని రహస్య ప్రాంతాల్లో పండించే గంజాయిని సురక్షిత ప్రాంతాల్లో నిల్వ ఉంచి, అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా పర్యాటకుల ముసుగులో వ్యాపారులు తరలిస్తున్నారు. పర్యాటకుల్లాగా ఒక్కో వాహనంలో నలుగురైదుగురు ప్రయాణిస్తూ, లగేజీ బ్యాగుల నిండా గంజాయిని నింపుతున్నారు. ఒడిశా, ఏపీల మధ్య పెదబయలు మండలం సమీపంలో మత్స్యగెడ్డ ఉంది. రాత్రి వేళల్లో గంజాయిని వ్యాపారులు నాటుపడవల్లో గెడ్డను దాటించి, ఒడిశాలోని పాడువా రోడ్డు మీదుగా వాహనాల్లో రవాణా చేస్తున్నారు. ఒడిశా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టలేకపోతోంది. దీంతో  గంజాయి రవాణాకు జైపూర్‌ రోడ్డు అనుకూలంగా మారింది.

తగ్గిన పోలీసు తనిఖీలు
ఐదు నెలల క్రితం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్యచేసిన తరువాత జరిగిన పరిణామాలతో డుంబ్రిగుడ, అరకులోయ ప్రాంతాల్లో పోలీసు తనిఖీలు పూర్తిగా తగ్గాయి. గతంలో డుంబ్రిగుడ మండలం జైపూర్‌ జంక్షన్‌లో డుంబ్రిగుడ పోలీసులు నిరంతరం తనిఖీలు చేపట్టేవారు.

అప్పట్లో ఒడిశాతో పాటు, పాడేరు ప్రాంతాల నుంచి గంజాయి రవాణాకు వ్యాపారులు భయపడేవారు. ఇటీవల పోలీసు తనిఖీలు విస్తృతంగా లేకపోవడంతో గంజాయి వ్యాపారులు అక్రమ రవాణాను పర్యాటకం పేరుతో విస్తరించారు. పగలు.. రాత్రి తేడా లేకుండా గంజాయితో కార్లు రయ్‌ రయ్‌ మంటున్నాయనే ప్రచారం జరుగుతోంది. పర్యాటకులు ప్రయాణించే వాహనాలపై తనిఖీలు పెద్దగా ఉండవు. కొంతమంది మహిళలను కార్లలో ఉంచుతుండడంతో వారంతా పర్యాటకులు, కుటుంబసభ్యులుగా కనిపిస్తారు.  అరకులోయలో ఎక్సైజ్‌ సర్కిల్‌ స్టేషన్‌ ఉన్నప్పటికీ గంజాయి రవాణాపై నిఘా మాత్రం కొరవడింది.

తనిఖీలు విస్తృతం చేస్తాం
డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి పోలీస్‌స్టేషన్ల పరిధిలో పోలీసుల తనిఖీలను మమ్మురం చేస్తాం. గంజాయి రవాణాపై దృష్టిపెట్టాం.అనుమానిత పర్యాటకుల వాహనాలను తనిఖీ చేయాలని సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. రాత్రి సమయంలో  తనిఖీలు నిరంతరం జరుగుతాయి. గంజాయి రవాణాకు పూర్తిగా అడ్డుకట్టవేస్తాం.– కోటేశ్వరరావు, సీఐ, అరకులోయ సర్కిల్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు