గల్ఫ్‌లో బందీ.. ఆగిన పెళ్లి 

26 Jun, 2019 12:01 IST|Sakshi
విషాదంలో బాధిత కుటుంబసభ్యులు 

సాక్షి, కోనరావుపేట(కరీంనగర్‌) : కొద్దిరోజుల్లోనే కుమారుడి వివాహం.. ఇందుకోసం ఇంటికి రంగులు వేయించి ముస్తాబు చేశారు. ఇంటిముందర పచ్చని పందిరి ఏర్పాటు చేశారు. బంధుమిత్రులకు వివాహ ఆహ్వాన పత్రికలు పంచారు. ఈ నెల 26న జరిగే వివాహానికి తప్పక హాజరుకావాలని కోరారు. అక్కడ అమ్మాయి తరఫు వారు కూడా వివాహం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి ఎంతో సంబురంతో దుబాయి నుంచి బయలు దేరాడు వరుడు. అనూహ్య రీతిలో అక్కడి జైలుకు తరలించారు పోలీసులు. దీంతో వధువు, వరుడి కుటుంబాలే కాదు.. రెండు గ్రామాల్లోనూ ఆందోళన నెలకొంది. వివరాలు ఇవీ.. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన కదిరె మల్లేశం, లత దంపతుల కుమారుడు వంశీకృష్ణ(25) ఉపాధి కోసం 2018 జనవరి 11న నిమ్మపల్లికి చెందిన ఏజెంట్‌ ఆనందం ద్వారా దుబాయికి వెళ్లాడు. నెలకు రూ.20 వేల వేతనమని ఏజెంట్‌ చెప్పినా.. అక్కడకు వెళ్లాక రూ.8 వేలే ఇచ్చారు. 

వివాహం నిశ్చయం కావడంతో..
వంశీకృష్ణకు చందుర్తి మండలం నర్సింగపూర్‌ గ్రామానికి చెందినగో యువతితో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. మేనరికం కావడం, ఇదివరకే వధూవరులు పెళ్లిచూపులు చూసుకోవడంతో వంశీకృష్ణ వివాహానికి ఒప్పుకున్నాడు. తాను జూన్‌లో స్వగ్రామం వస్తానని, అప్పుడే ముహూర్తం ఖరారు చేయాలని తల్లిదండ్రులను కోరాడు. దీంతో ఈ నెల 26న పెళ్లి ఉండడంతో అన్ని ఏర్పాటు చేశారు కుటుంబసభ్యులు. బంధువులు కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు.

ఇంటికి వస్తూ జైల్లోకి...
వంశీకృష్ణ జూన్‌ 3న అక్కడి నుంచి బయలు దేరాడు. అతడి వద్ద కంపెనీ వీసా లేకపోవడంతో పోలీసులు పట్టుకుని జైలుకు తరలించారు. అంతే.. కుమారుడు వస్తున్నాడనే ఆనందంలో ఉన్న తల్లిదండ్రులు హతాశయులయ్యారు. పెళ్లి వేడుకలతో కళకళలాడాల్సిన వారి ఇల్లు కళ తప్పింది. కుటుంబసభ్యులు, బంధువులు వంశీకృష్ణ రాకకోసం ఎదురుచూస్తున్నారు. తమ కుమారుడిని త్వరగా జైలు నుంచి విడిపించాలని తల్లిదండ్రులు కదిరె మల్లేశం, లత, సోదరుడు అరుణ్‌ వేడుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు