అమ్మా..! నన్ను చంపేస్తున్నారు

25 Oct, 2017 08:48 IST|Sakshi

తొందరగా రామ్మా..

తల్లి వచ్చేలోపే ఉరికి వేలాడుతున్న కూతురు

భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

‘అమ్మా..! ఇంట్లో గొడవ జరుగు తోంది..  నన్ను కొడుతున్నారు.. నువ్వు రాకుంటే నన్ను చంపేస్తారు.. త్వరగా ఇక్కడికి రామ్మా..’ ఇవి ఓ కుమార్తె ఫోన్‌లో తన తల్లితో చివరి సారిగా చెప్పిన మాటలు. ఈ మాటలను బట్టి అత్తారింట్లో ఆమె ఎంత నరకం  అనుభవిస్తుందో తెలుస్తోంది.. తన కుమార్తెకు ఏమవు తుందోనని వెంటనే ఆ తల్లి అక్కడికి వచ్చింది. ఎంతో ఆందోళనగా వచ్చిన తల్లికి ఉరి తాడుకు వేలాడుతున్న కూతురు మృతదేహం కనిపించింది.

ప్రొద్దుటూరు క్రైం :
ప్రొద్దుటూరు మండలం నరసింహాపురం గ్రామంలో భర్త వేధింపులు తాళలేక చౌడం వెంకటలక్ష్మి (27) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరులోని హనుమాన్‌నగర్‌కు చెందిన వెంకటసుబ్బయ్య, వెంకటలక్షుమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారిలో మూడో కుమార్తె వెంకటలక్ష్మి. తల్లిదండ్రులు చేనేత పని చేస్తుంటారు. లక్ష్మికి 9 ఏళ్ల క్రితం ఖాదర్‌బాద్‌కు చెందిన వెంకటేష్‌తో వివాహం జరిపించారు. పెళ్లి అయ్యాక వెంకటేష్‌ కుటుంబం ప్రొద్దుటూరు మండలంలోని నరసింహాపురం గ్రామంలో స్థిరపడింది. గతంలో వెంకటేష్‌ చేనేత పని చేసేవాడు. అయితే కొన్ని నెలల నుంచి పిప్పర్‌మెంట్‌ ఫ్యాక్టర్‌లో పని చేయడానికి వెళ్తున్నాడు. వారికి భరత్‌ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. కొన్ని రోజుల నుంచి అతను భార్యను నిత్యం వేధిస్తున్నట్లు వెంకటలక్ష్మి తల్లి ఆరోపిస్తోంది. దసరా పండుగ నిమిత్తం లక్ష్మి అమ్మగారింటికి వెళ్లి మూడు రోజులు ఉండి వచ్చింది. అదే ఆమె చివరి రాక.

ఫోన్‌ చేసిన కొద్ది నిమిషాలకే..
నరసింహాపురం గ్రామంలో లక్ష్మి బయటికి కూడా వచ్చేది కాదని స్థానికులు చెబుతున్నారు. తన పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉండేదంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం లక్ష్మి తన తమ్ముడు సుబ్బయ్యకు ఫోన్‌ చేసి మాట్లాడింది. బాగున్నావా అని  క్షేమ సమాచారాలు అడిగింది. తమ్ముడితో బాగా మాట్లాడిన లక్ష్మి కొన్ని నిమిషాల తర్వాత తల్లికి ఫోన్‌ చేసింది. తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని,  వెంటనే ఇక్కడికి రాకుంటే చంపేస్తారని ఆమె తల్లికి చెప్పింది. తన కుమార్తెను కొడుతున్నారేమోనని భావించిన తల్లి వెంకటలక్షుమ్మ వెంటనే నరసింహాపురం గ్రామానికి వెళ్లింది. అయితే ఆమె  గుమ్మంలోకి వెళ్లగానే ఎదురుగా కూతురు ఉరి తాడుకు వేలాడుతోంది.

ఆ సమయంలో ఇంట్లో మృతురాలి భర్త, అత్త లేరు. వారు అదే ప్రాంతంలోని మరో ఇంట్లో ఉన్నారు. తల్లి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకొని ఫ్యాన్‌కు వేలాడుతున్న లక్ష్మిని కిందికి దించగా అప్పటికే మృతి చెందింది. వచ్చేలోపే కన్నుమూశావా తల్లి అంటూ తల్లి రోదించసాగింది. బంగారం లాంటి నా కుమార్తెను ఆమె భర్త, అత్త కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది.  విషయం తెలియడంతో రూరల్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ అక్కడి చేరుకొని జరిగిన సంఘటనపై విచారించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు