అత్తింటి వేధింపులు

22 Jan, 2019 13:15 IST|Sakshi
చంటిబిడ్డతో ఎన్‌ఎస్‌ఆర్‌ కాలనీ వద్ద ఉన్న పోతమ్మ

చిన్నారితో సహా రైలుకు ఎదురెళ్లి వివాహిత ఆత్మహత్యాయత్నం

కాపాడిన ప్రజలు  నాయుడుపేటలో చోటుచేసుకున్న ఘటన

నెల్లూరు , నాయుడుపేటటౌన్‌: భర్తతోపాటు అత్త వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి చెందిన ఓ వివాహిత తన చంటిపాపతో కలిసి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యాయత్నానికి పూనుకుంది. ఇద్దరు వ్యక్తులు గుర్తించి పరుగున వెళ్లి వారిద్దరిని కాపాడిన ఘటన పట్టణ పరిధిలోని ఎన్‌ఎస్‌ఆర్‌ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసుల కథనం మేరకు.. పోతమ్మ అనే మహిళకు అగ్రహారపేటకు చెందిన పసల మదన్‌కుమార్‌తో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి జాషువ అనే కుమారుడు, మధుప్రియ అనే నెలల చంటిపాప ఉన్నారు. మదన్‌కుమార్‌ కొంతకాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని పోతమ్మను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో రెండురోజుల క్రితం ఆమె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్సై జి.వేణు మదన్‌కుమార్‌ను పిలిచి కౌన్సిలింగ్‌ ఇచ్చి మందలించి పంపించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అత్త పోతమ్మను పరుష పదజాలంతో దూషించింది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో వెళ్లేందుకు సిద్ధమవుతుండగా మనస్తాపానికి గురైన పోతమ్మ సోమవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి చంటిబిడ్డను తీసుకుని బయటకు వచ్చేసింది.

రైలుకి ఎదురెళుతుండగా..
పోతమ్మ బిడ్డతో కలిసి తనువు చాలించేందుకు పట్టణ సమీపంలోని ఎన్‌ఎస్‌ఆర్‌ కాలనీ రైలుపట్టాల వద్దకు వెళ్లింది. చెన్నై వైపు నుంచి రైలు వస్తుండడంతో దానికి ఎదురుగా చంటిబిడ్డతోపాటు వెళుతుండగా కాలనీకి చెందిన కప్పల మునుస్వామి, నాగరాజులు గుర్తించారు. వారు వెంటనే వెళ్లి రైలుపట్టాల మధ్యలో ఉన్న ఆమెను పక్కకు లాగారు. కాలనీ మహిళలు ఆమెకు అక్కున చేర్చుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఇంటికి వెళితే అత్తమామలు తిరిగి వేధిస్తారని, తనను వదిలిపెట్టాలని పోతమ్మ చెప్పడంతో మహిళలు ఆమెకు ధైర్యం చెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివాహితను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎస్సై వేణు మదన్‌కుమార్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించినా రాత్రి వరకు కూడా రాలేదు. దీంతో ఆమెను మూలపడవలోని తల్లిదండ్రుల వద్దకు పంపారు. బాధితురాలికి న్యాయం చేసేలా చర్యలు చేపడతామని ఎస్సై తెలిపారు. తల్లీబిడ్డను కాపాడిన ఇద్దరు వ్యక్తులను స్థానికులు అభినందించారు.

మరిన్ని వార్తలు