ఎంతపని చేశావ్‌ శ్రావణీ..

29 Jun, 2018 07:00 IST|Sakshi
భర్త రామకృష్ణతో శ్రావణి(ఫైల్‌)

హైదరాబాద్‌లో 11వ అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

కొన్నాళ్ల క్రితం సోదరి మృతి

కన్నీరు మున్నీరవుతున్నవృద్ధ దంపతులు

కలికిరి: వృద్ధాప్యంలో ఆ తల్లితండ్రుల గుండెలు శోకసంద్రమయ్యాయి. హైదరాబాద్‌లో మంచి ఉద్యోగం చేసుకుంటూ బతుకుతుందని భావించిన కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇంట విషాదం అలముకుంది. వివరాలివి. కలికిరికి చెందిన మూలింటి తిప్పారెడ్డి దిగువ మధ్య తరగతికి చెందిన వారు. కొద్దో గొప్పో భూమి ఉన్నా అది కాస్తా వాయల్పాడు సెజ్‌ కోసం ఇచ్చేయాల్సి వచ్చింది. ఈయనకు ఇద్దరు ఆడపిల్లలు..చిన్నమ్మాయి పావని తొమ్మిదేళ్ల  వయసులో డెంగీతో మృతిచెందింది. దీంతో పెద్దమ్మాయి శ్రావణిని పట్టుదలగా చదివించారు. శ్రావణి కూడా తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు మంచి మార్కులు తెచ్చుకునేది. హైదరాబాద్‌లోని ప్రైం ఏరా మెడికల్‌ టెక్నాలజీలో ఉద్యోగం వచ్చింది.

ఏడాదిన్నర క్రితం రామకృష్ణ అనే వ్యక్తితో వివాహం చేశారు. మదీనాగూడాలో నివాసం ఉండేవారు. ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చింది. శ్రావణి నాలుగు నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. చాలామంది వైద్యులకు చూపించినా నయం కాలేదు. అయినా విధులకు వెళ్తుండేది. ఈనేపథ్యంలో మనుమడి ఆలనా పాలన చూసేందుకు శ్రావణి తల్లి ఈశ్వరమ్మ బుధవారం హైదరాబాద్‌ బయలు దేరి వెళ్లింది. తీరా అక్కడకు చేరుకున్న కొద్దిగంటలకే ఈశ్వరమ్మ దారుణమైన వార్త వినాల్సి వచ్చింది. గురువారం ఉదయం 10గంటల సమయంలో తాను పనిచేస్తున్న సంస్థ భవనం 11వ అంతస్తు నుంచి దూకి శ్రావణి(28) ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తిప్పారెడ్డి దంపతుల్ని విషాదంలో ముంచింది. బిడ్డ ఆఖరి చూపుకోసం శ్రావణి తండ్రి తిప్పారెడ్డి హైదరాబాద్‌కు బయలుదేరారు. వృద్ధాప్యంలో మాకు దేముడు పెద్ద శిక్ష వేశాడంటూ ఆయన కన్నీరుమున్నీరయ్యారు.

మరిన్ని వార్తలు