బ్రిడ్జి రెయిలింగ్‌కు ఉరివేసుకొని

7 Feb, 2019 10:18 IST|Sakshi
మంగతాయారు మృతదేహం

మహిళ ఆత్మహత్య

సనత్‌నగర్‌: తాగుడుకు బానిసైన భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఫతేనగర్‌ బ్రిడ్జి రెయిలింగ్‌కు ఉరివేసుకుంది. ఈ సంఘటన సనత్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన మేరకు.. కాకినాడకు చెందిన భీమేశ్వరరావు, మంగతాయారులు సనత్‌నగర్‌ ఎస్‌ఆర్‌టీ కాలనీలో ఉంటూ నివాసముంటున్నారు. భీమేశ్వరరావు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. కొన్నేళ్లుగా భీమేశ్వరరావు మద్యానికి బానిసయ్యాడు. భార్యను మానసికంగా, శారీరికంగా వేధించేవాడు. తాగుడు మాన్పించే టాబ్లెట్స్‌ ఉన్నాయని పలువురి చెప్పగా విని వాటిని కూడా తెప్పించింది. భర్తతో వాటిని వేయించే విషయమై కూడా గొడవలు జరుగుతుండేవి.

ఈ క్రమంలో మంగతాయారు రెండు మార్లు ఇంటి నుంచి వెళ్ళిపోయి తిరిగి వచ్చింది. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరకు భర్తతో తాగుడు మాన్పించేందుకు తెచ్చిన టాబ్లెట్లను పెద్ద మొత్తంలో మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారకస్థితికి వెళ్ళి ప్రాణాలతో బయటపడింది. ఇంతజరిగినా భీమేశ్వరరావులో మార్పురాలేదు. మంగళవారం రాత్రి ఇంట్లో బంధువులు ఉండగానే ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన మంగతాయారు రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. అర్ధరాత్రి సమయంలో ఫతేనగర్‌ నుంచి సనత్‌నగర్‌ వైపు ఫ్లైఓవర్‌ దిగే ప్రాంతంలోని రెయిలింగ్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున స్థానికులు ఫ్లైఓవర్‌ రెయిలింగ్‌కు యువతి మృతదేహం వేలాడుతున్న విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దించి ఆమె గురించి వాకబు చేయగా మంగతాయారుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త కూడా అక్కడికి చేరుకోవడంతో పోలీసులు అతనిని విచారించారు.

మరిన్ని వార్తలు