విషం తాగి వివాహిత ఆత్మహత్య

24 Dec, 2018 13:37 IST|Sakshi
సాయిభాను మృతదేహం

భర్త మరొకరితో సహజీవనం చేయడమే కారణం

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు  

నెల్లూరు(క్రైమ్‌): ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత మరో మహిళతో సహజీవనం చేయడం ప్రారంభించాడు. ఈ విషయమై దంపతుల నడుమ విభేదాలు పొడచూపాయి. పద్ధతి మార్చుకోమని పలుమార్లు భార్య కోరింది. అయినా అతనిలో మార్పురాకపోవడంతో జీవితం మీద విరక్తి చెంది వివాహిత విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు వెంకటేశ్వరపురానికి చెందిన సాయిభాను (29), రాజీవ్‌ గృహకల్పకు చెందిన శేఖర్‌లు నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి రాజీవ్‌గృహకల్పలో నివాసం ఉంటున్నారు. సాయిభాను పాచి పనులు చేస్తుండగా, శేఖర్‌ ఆటో నడుపుతున్నాడు. శేఖర్‌ తరచూ బీవీనగర్‌లోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో స్నేహితుని భార్య చెల్లెలితో అతనికి పరిచయమైంది. ఇద్దరూ సన్నిహితంగా ఉండసాగారు.

భర్త ప్రవర్తనలో మార్పురావడాన్ని గుర్తించిన సాయిభాను అతని గురించి ఆరాతీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో భర్తను పద్ధతి మార్చుకోమని చెప్పింది. అయినా అతని ప్రవర్తనలో మార్పురాకపోగా మహిళకు మరింత దగ్గరయ్యాడు. దీంతో సాయిభాను పెద్దలను ఆశ్రయించి న్యాయం చేయమని కోరింది. వారు సర్దిచెప్పి కాపురాన్ని చక్కదిద్దారు. కొద్దిరోజులు ప్రశాంతంగా ఉన్నారు. వారంరోజుల క్రితం శేఖర్‌ ఏకంగా ఆ మహిళను తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకువచ్చాడు. అక్కడే ఉంచి ఆమెతో సహజీవనం చేయసాగాడు. దీంతో సాయిభాను, శేఖర్‌ల నడుమ రోజూ తీవ్ర ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. ఆ మహిళను పంపివేయాలని భార్య పట్టుబట్టింది. అయినా శేఖర్‌ పట్టించుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన సాయిభాను ఈనెల 17వ తేదీన విషం తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు హుటాహుటిన జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 22వ తేదీన మృతిచెందింది. సమాచారం అందుకున్న చిన్నబజారు ఎస్సై కరిముల్లా ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఆదివారం మృతురాలి కుటుంబసభ్యులు సమక్షంలో స్థానిక తహసీల్దార్‌ మృతదేహానికి శవపంచనామా నిర్వహించారు. ప్రభుత్వ వైద్యులు మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతురాలి చెల్లెలు పావని ఫిర్యాదు మేరకు కరిముల్లా కేసు దర్యాప్తు చేస్తున్నారు.    

మరిన్ని వార్తలు