వరకట్న వేధింపులతోనే నా బిడ్డ మృతి

12 Jan, 2019 07:11 IST|Sakshi
ఆదిలక్ష్మి

పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆదిలక్ష్మి తండ్రి

విశాఖపట్నం, పరవాడ(పెందుర్తి): లంకెలపాలెం దరి మంత్రిపాలెం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో నివాసం ఉంటున్న ఆదిలక్ష్మి మృతికి ఆమె భర్త, అత్త వేధింపులే కారణమని మృతురాలి తండ్రి వేములపల్లి సత్తిబాబు పరవాడ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసుల వద్ద వాపోయాడు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలివి.. మంత్రిపాలెం గ్రామ సమీపంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో నివాసం ఉంటున్న పెదపల్లి ఆదిలక్ష్మి బుధవారం రాత్రి ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కోటనందూరు మండలం లక్ష్మీపురానికి చెందిన సత్తిబాబు బతుకుదెరుకు కోసం 20 ఏళ్ల కిందట కుటుంబంతో హైదరాబాద్‌ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తన కుమార్తె ఆదిలక్ష్మిని నాలుగేళ్ల కిందట కోటవురట్ల దరి సుంకుపురానికి చెందిన పెదపల్లి శ్రీనుకు ఇచ్చి వివాహం చేశారు.

వివాహ సమయంలో నాలుగు తులాల బంగారం, రూ.1.50 లక్షల కట్నం, ఆడపడుచు కట్నం కింద రూ.20 వేలు, అదనపు లాంఛనాల కింద మరో రూ.30 వేలను తన అల్లుడికి అందజేసినట్టు సత్తిబాబు తెలిపారు. బీహెచ్‌ఈఎల్‌లో వంట మనిషిగా విధులు నిర్వహిస్తున్న శ్రీను, ఆదిలక్ష్మి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలోని 13 బ్లాక్‌ మొదటి అంతస్తులో నివాసం ఉంటున్నారు. కాగా.. గురువారం ఉదయం ఆదిలక్ష్మి ఉరిపోసుకుని మరణించిందని తన రెండో అల్లుడు నుంచి సమాచారం అందిందని సత్తిబాబు తెలిపారు. మంత్రిపాలెంలో ఇంటి స్థలం కొనుగోలు కోసం అదనపు కట్నం తీసుకురమ్మని అల్లుడు, అతని తల్లి నూకాలమ్మ కొంత కాలం నుంచి తన కుమార్తెను వేధిస్తున్నారని, ఆ వేధింపులను తట్టుకోలేక తన బిడ్డ ప్రాణం తీసుకుందని ఆరోపించారు. అతని ఫిర్యాదు మేరకు పరవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తహసీల్దార్‌ కేవీవీ శివ, గాజువాక ఏసీపీ ప్రేమఖాజల్, సీఐ బీసీహెచ్‌. స్వామినాయుడు, ఎస్‌ఐ జి.వెంకటరావులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. సీఐ స్వామినాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు