వరకట్న వేధింపులకు వివాహిత బలి

21 Oct, 2019 08:49 IST|Sakshi
శ్వేత మృతదేహం

పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): అదనపు కట్న వేధింపులు తాళలేక పాతనగరం పరిధి పంజాకూడలిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం... పంజా కూడలిలో నివాసం ఉంటున్న తోట శంకరరావు తన కుమార్తె శ్వేత(31)కు శంకరమఠం రోడ్డులో నివాసముంటున్న పూసర్ల కృష్ణకాంత్‌తో రెండేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. వివాహ సమయంలో అల్లుడికి రూ.4లక్షల నగదు, 20 తులాల బంగారం, రూ.1.5 లక్షల విలువ గల ఫర్నీచర్, మరో మూడు తులాల బంగారం శ్వేత తల్లిదండ్రులు ఇచ్చారు. అయినప్పటికీ వివాహం జరిగినప్పటి నుంచి అదనపు కట్నం కోసం శ్వేత భర్త కృష్ణకాంత్‌తోపాటు అతడి తండ్రి సత్యనారాయణ, కుటుంబ సభ్యులు వేధించసాగారు.

తమకు అదనంగా రూ.20 లక్షల నగదుతోపాటు వంద గజాల స్థలం ఇవ్వాలని శ్వేతను వేధించారు. అత్తింటి వారి వేధింపులు తాళలేక శ్వేత తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది. ఈ నేపథ్యంలో గత నెల 18న కృష్ణకాంత్‌ తన భార్య శ్వేతకు విడాకుల నోటీసు పంపాడు. అప్పటి నుంచి మనస్తాపంతో బాధపడుతున్న శ్వేత శనివారం రాత్రి ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. శ్వేత తండ్రి శంకరరావు ఫిర్యాదు మేరకు వేధింపుల కేసు నమోదు చేసిన వన్‌టౌన్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సీఐ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు