వివాహిత బలవన్మరణం

9 Nov, 2019 12:00 IST|Sakshi
ఆస్పత్రి వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు , మృతురాలు నాగలక్ష్మి.(ఫైల్‌)

భర్త వివాహేతర సంబంధమే కారణం

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగలక్ష్మి మృతి

మృతురాలి తండ్రి లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు

గత ఏడాది ఏప్రిల్‌లో వివాహం జరిగింది.  పదికాలలపాటు చల్లగా ఉండాలని తల్లిదండ్రులు ఆశీర్వదించి తమ కుమార్తెను అత్తంటికి పంపించారు. కట్టుకున్నవాడు వ్యసనపరుడు..వివాహేతర సంబంధం కూడా ఉంది. ఇన్ని విషయాలు తెలుసుకున్న నవ వధువు..ఇవి వద్దు అంటూ వేడుకుంది. అయినా భర్తలో మార్పు రాలేదు. దీంతో పురుగులు మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కె.కోటపాడు మండలం పిండ్రంగిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎ.కోడూరు ఎస్‌ఐ బి.సతీష్‌ అందజేసిన వివరాలు ఇలా ఉన్నాయి..    

విశాఖపట్నం , –కె.కోటపాడు (మాడుగుల) : విశాఖలోని కంచరపాలేనికి చెందిన జాగరపు నాగలక్ష్మి(22)కి పిండ్రంగి గ్రామానికి చెందిన గౌరినాయుడుకు గత ఏడాది ఏప్రిల్‌లో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది నెలలు ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. కొద్ది నెలల్లోనే గౌరి నాయుడు అసలు స్వరూపం బయటపడింది. వ్యసనాలకు బానిసయ్యాడు. అలాగే గ్రామంలో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై ఐదు నెలలుగా భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి ఇంటికి వచ్చిన భర్తతో ఎప్పటిలాగే వివాహేతర సంబంధంపై నాగలక్ష్మి ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. వేదనకు గురైన నాగలక్ష్మి పురుగులు మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న భార్యను కె.కోటపాడు 30 పడకల ఆస్పత్రికి శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు తీసుకువెళ్లాడు. వైద్య సిబ్బంది చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి నాగలక్ష్మి మృతి చెందింది.

అల్లుడి తీరు కారణంగానే..
అల్లుడు గౌరినాయుడు తీరుతో మానోవేదనకు గురైన తన కుమార్తె నాగలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు లక్ష్మి,వెంకటరావు బోరున విలపించారు. వ్యసనాలతోపాటు వివాహేతర సంబంధం కారణంగానే ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని, భర్తలో మార్పు తీసుకురావాలని ఎంతో ప్రయత్నించిందని, అయినా మార్పు రాకపోవడంతో అఘాయత్యానికి పాల్పడిందని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ ఎం.లక్ష్మి సమక్షంలో పంచనామా జరిపిన పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసును నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌.ఐ సతీష్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు