ఎంతపని చేశావు తల్లీ..!

7 Mar, 2020 08:09 IST|Sakshi
మృతి చెందిన లతా, నిఖిత (ఫైల్‌)

సాక్షి, అన్నానగర్‌: కిరోసిన్‌ పోసుకుని బిడ్డతో పాటు తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నై రాయపేటలో గురువారం జరిగింది. పైలట్‌ చందు ప్రాంతానికి చెందిన సత్యనారాయణన్‌ అదే ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్నాడు. భార్య లతా (27). వీరికి ఏడాది వయసు గల కుమార్తె నిఖితా ఉంది. లతా 2వసారి గర్భం దాల్చింది. కొద్ది రోజుల క్రితం ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో పోరూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. అబార్షన్‌ కావడంతో బుధవారం ఇంటికి వచ్చింది. అయినా రక్తస్త్రావం ఆగకపోవడంతో మనోవేధనకు గురైంది.

గురువారం ఉదయం భర్త ఎప్పటిలాగే పనికి వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బిడ్డతో పాటు తనపై కిరోసిన్‌ పోసుకుని నిప్పు పెట్టుకుంది. కేకలు విన్న స్థానికులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. దీనిపై రాయపేట పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహమై రెండేళ్లు మాత్రమే కావడం వల్ల ఈ కేసు ఆర్‌డీఓ విచారణకి మార్చారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు