వివాహిత దారుణహత్య

17 Dec, 2019 11:21 IST|Sakshi
హత్యాస్థలిని పరిశీలిస్తున్న డీఎస్పీ, సీఐ (ఇన్‌సెట్‌) వెంకటలక్ష్మి (ఫైల్‌)

అనంతపురం, పుట్లూరు: మడుగుపల్లి ఎస్సీ కాలనీలో వివాహిత దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో భర్తే ఆమెను కడతేర్చినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  మడుగుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన వెంకటలక్ష్మి(30)కి ఎనిమిదేళ్ల కిందట నార్పల మండలం దుగుమర్రికి చెందిన వీరశేఖర్‌తో వివాహమైంది. కొన్నేళ్లు వీరి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగింది. ఇటీవల భార్య ప్రవర్తనపై వీరశేఖర్‌ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. వేధింపులు పెరిగిపోవడంతో ఎనిమిది నెలల క్రితం ఆరేళ్ల కుమారుడు దేవాను తీసుకుని వెంకటలక్ష్మి తన పుట్టింటికి వచ్చింది. బంధువులు, ఇతర పెద్దలు పంచాయితీ చేసి నెల రోజుల క్రితం మెట్టినింటికి పంపారు. అయినా వీరశేఖర్‌ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేకపోవడంతో మళ్లీ 20 రోజుల క్రితం ఆమె మడుగుపల్లిలోని పుట్టింటికి వచ్చేసింది.

ఈ క్రమంలో శనివారం సాయంత్రం వీరశేఖర్‌ మడుగుపల్లికి వచ్చాడు. సోమవారం ఉదయాన్నే తాను దుగుమర్రికి వెళ్తున్నానని భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులు నడిపి బయన్న, లక్ష్మిదేవిలకు చెప్పి బయల్దేరాడు. అల్లుడు వెళ్లిపోయాక బయన్న, లక్ష్మిదేవి దంపతులు కూలి పనులకు వెళ్లారు. సాయంత్రం వేళ కుమారుడు సమీప ఇళ్ల వద్దకు ఆడుకునేందుకు వెళ్లాడు. ఇక ఒంటరిగా ఉన్న వెంకటలక్ష్మి కాసేపటికే దారుణహత్యకు గురైంది. స్థానికుల సమాచారంతో ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన ఇంటికి చేరుకుని బోరున విలపించారు. సంఘటన స్థలంలో రుబ్బుడుగుండు, కొడవలి పడి ఉన్నాయి. హత్యాస్థలిని తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ దేవేంద్రకుమార్‌ పరిశీలించారు. హత్యకు గల కారణాలపై మృతురాలి తల్లిదండ్రులను ఆరా తీశారు. భర్తే రుబ్బుడుగుండుతో మోది హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. హతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు