నాలుగు రోజుల నుంచి శవంతో ఆందోళన

4 Jun, 2018 09:18 IST|Sakshi
నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే రసమయి

గన్నేరువరం(మానకొండూర్‌) : ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఆమె చేసిన పాపమో.. ఇద్దరు ఆడపిల్లలకు జన్మనివ్వడం పాపమో గాని అత్తింటి వేధింపులకు స్వప్న అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అమ్మ మృతదేహం శవపెటికలో.. నాన్న ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి ఆ చిన్నారులది. నాలుగురోజులైన అంత్యక్రియలు జరగకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. బాధితులకు రోజురోజుకు వివిధ పార్టీలు, గ్రామస్తులు, మహిళ సంఘాల మద్దతు పెరుగుతున్నా ఈ కేసు కొలిక్కి రావడం లేదు. నిందితులను పోలీసులే తప్పించారని కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తుండగా.. వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఏదిఏమైనా శవంతో భర్త ఇంటి ఎదుట నాల్గో రోజు ఆందోళన కొనసాగుతోంది.

నిందితులను పట్టుకునేదెప్పుడో..
కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలంలో గుండ్లపల్లికి చెందిన కట్కూరి శ్రీపాల్‌రెడ్డి భార్య కట్కూరి స్వప్న మే 31న అత్తింటి వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కూతుళ్లు విస్మయ్య, విన్నత్న ఉన్నారు. తల్లి మృతి చెందడంతో చిన్నారులను తండ్రి పట్టించుకునే పరిస్థితి లేదని పేర్కొంటూ ఆస్తిని పిల్లల పేరున రిజిస్ట్రేషన్‌ చేయాలనే డిమాండ్‌తో శవంతో ఆందోళన చేపట్టారు. అదేరోజు రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి మృతురాలి అత్తామామ అరుణ–అంజిరెడ్డిని తరలించారు.

అక్కడికి వెళ్లాక మరునాడు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామనే హామీతో మృతురాలి కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. రెండోరోజు స్పందన లేకపోవడంతో గుండ్లపల్లి రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో చేశారు. ఆ సమయంలో 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని సీపీ కమలాసన్‌రెడ్డి హామీతో రాస్తారోకో విరమించి శవాన్ని మళ్లీ భర్త ఇంటికి తరలించారు. అయినా మూడో రోజు వరకు నిందితులను పోలీసులు పట్టుకున్న దాఖలాలు లేవు.

ఎమ్మెల్యే పరామర్శ
పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో నాల్గోరోజు ఆదివారం శవంతో భర్త ఇంటి ముందు ఆందోళనను మృతురాలి కుటుంబసభ్యుల కొనసాగించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ గూడెల్లి తిరుపతి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి పరామర్శించి మృతదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మృతురాలి తల్లిదండ్రులు శారద–వెంకటప్రకాష్‌ ఎమ్మెల్యేకు తమ ఆవేదనను విన్నపించారు. అదనపు కట్నం కోసం భర్త, అత్తామామలు వేధించి హత్య చేశారని, పిల్లలకు న్యాయం చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. నాలుగురోజులుగా శవంతో ఆందోళన చేస్తున్నా నిందితులను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. మహిళ సంఘాల సభ్యులు, గ్రామ మహిళలు సైతం జరుగుతున్న పరిణామాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే స్పందిస్తూ తీవ్ర దిగ్బ్రాంతి కలిగే విచారకరమైన ఘటన అని, ఇలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే అన్నారు. పిల్లలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

నాయకుల పరామర్శ
మృతురాలి కుటుంబ సభ్యులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌ పార్టీ రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్‌వర్మ, బెజ్జంకి మండల బీజేపీ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు పలువురు స్వప్న కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలియజేశారు. పోలీసులు తక్షణమే నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కొంకటి అనిల్, ఏఐవైఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ముల్కల మల్లేశం, అందె స్వామి, కార్యవర్గ సభ్యులు గూడెం లక్ష్మీ, లక్ష్మినారాయణ, మాడిశెట్టి భాగ్యలక్ష్మి, కిన్నెర మల్లవ్వ ఉన్నారు.

మరిన్ని వార్తలు