అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

19 Dec, 2019 13:18 IST|Sakshi
జంగారెడ్డిగూడెంలో మృతురాలు బేతపూడి హేమలత (29)

భర్తే చంపాడంటున్న మృతురాలి బంధువులు

పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: పట్టణంలో ఓ వివాహిత బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాత్రూమ్‌లో పడి మృతి చెందినట్లు భర్త చెబుతుండగా, హతురాలి సోదరి, సోదరుడు మాత్రం భర్త ప్రవీణ్‌కుమారే హత్యచేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతురాలు హేమలత (29) స్థానికంగా ఉన్న ఒక ఫొటో కలర్‌ల్యాబ్‌లో పనిచేస్తోంది. ఈమెకు ఆరేళ్ల క్రితం కొవ్వూరు మండలం పి.సావరం గ్రామానికి చెందిన గంటా ప్రవీణ్‌కుమార్‌తో పరిచయం కాగా, వారిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం కొంతకాలం నిమ్మలగూడెంలో కాపురం ఉన్నారు. నాలుగు నెలల క్రితం జంగారెడ్డిగూడెంలో బస్టాండ్‌ ఎదురుగా ఒక ఇల్లును అద్దెకు తీసుకుని కాపురం ఉంటున్నారు. ఇదిలా ఉండగా, హేమలత బాత్‌రూమ్‌లో పడిపోయిందని, మాట రావడం లేదని, ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళుతున్నానని భర్త ప్రవీణ్‌కుమార్‌ బుధవారం ఉదయం మృతురాలి సోదరుడు రాంపండుకు ఫోన్‌లో చెప్పాడు.

దీంతో రాంపండు, సోదరి లీల, వరుసకు మేనమామ అయిన భానుశివకుమార్‌ వెంటనే ప్రభుత్వాసుపత్రికి చేరుకోగా, అప్పటికే హేమలత మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. ప్రవీణ్‌కుమార్‌ తమ సోదరిని హత్యచేసి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లుగా చిత్రీకరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల భర్త ప్రవీణ్‌కుమార్‌ తన ఖర్చుల కోసం డబ్బులు ఇమ్మని తమ సోదరిని వేధించేవాడని వాపోయారు. కాగా ఘటనా స్థలాన్ని జంగారెడ్డిగూడెం సీఐ బీఎన్‌ నాయక్, ఎస్సై ఎ.దుర్గారావు పరిశీలించారు. అలాగే ఇన్‌చార్జి డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని కేసు వివరాలు పరిశీలించారు. అంతేగాక సోదరి లీల జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌కు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. కాగా నిందితుడు ప్రవీణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.  హేమలత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, గతంలోనే ప్రవీణ్‌కుమార్‌కు వేరే మహిళతో వివాహమైనట్లు తెలిసింది. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాయక్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు