వివాహిత వాట్సాప్‌ మెసేజ్‌పై కలకలం

22 Oct, 2018 11:08 IST|Sakshi
షబానా , షబానా ముగ్గురు పిల్లలు

ముగ్గురు బిడ్డలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడి

భర్త వేధింపులు తాళలేకే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన

ఇంటికి తాళం వేసి అదృశ్యం ఆందోళనలో కుటుంబ సభ్యులు

చిత్తూరు, మదనపల్లె: భర్త వేధింపులు, అవమానాలు భరించలేక ముగ్గురు బిడ్డలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వివాహిత పెట్టిన వాట్సాప్‌ మెసేజ్‌ మదనపల్లె పట్టణంలో ఆదివారం కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని మోతీనగర్‌ ఉర్దూ పాఠశాల వీధికి చెందిన షబానా (35)కు అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ముస్తఫాతో వివాహమైంది. వీరికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు ఆఫ్రిద్‌(12) గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. కవల పిల్లలైన ఆరీఫ్, మునీర్‌ ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ముస్తఫా స్థానికంగా ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అతను సక్రమంగా పనికి వెళ్లేవాడు కాదు. ఇంటికి సక్రమంగా వచ్చేవాడు కాదు. భార్యపై అనుమానంతో వేధింపులకు గురిచేస్తుండేవాడు.

దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్త కుటుంబ పోషణకు ఏ మాత్రం సహకరించకపోవడంతో షబానా ఇంటిలోనే చిన్నపాటి చిల్లర దుకాణాన్ని నడుపుకుంటూ బిడ్డలను పోషించుకుంటోంది. మూడు రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు అధికమయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం భర్త తనను పోషించలేని స్థితికి చేరుకోవడమే కాకుండా తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, అత్త, మామ కుమారుడిని సక్రమ మార్గంలో పెట్టకపోగా అతడికే మద్దతు తెలుపుతుండడంతో గత్యంతరంలేని స్థితిలో బిడ్డలను తీసుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆదివారం వాట్సాప్‌లో తల్లికి మెసేజ్‌ పెట్టింది. అనంతరం బిడ్డలను తీసుకుని అదృశ్యమైంది. వాట్సాప్‌ వీడియో మధ్యాహ్నానికి వైరల్‌ అయ్యింది. విషయం తెలుసుకున్న భర్త ముస్తఫా ఇంటి వద్దకు వచ్చాడు. చుట్టుపక్కల వారు జరిగిన విషయం తెలియపరిచి ఎందుకిలా చేశావని అడిగేలోపు అక్కడి నుంచి పరారయ్యాడు. షబానా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి షబానా, బిడ్డల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తన కష్టాన్ని చుట్టుపక్కల వారికి తెలియనివ్వకుండా గుట్టుగా నెట్టుకొచ్చిన షబానా బిడ్డలతో సహా తనువు చాలిస్తానంటూ చెప్పడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు