అత్తింటి వేధింపులు.. కట్నం తేకుంటే చచ్చిపో

12 Dec, 2019 08:24 IST|Sakshi
ప్రసూణ(ఫైల్‌) ,అనాథగా మారిన చిన్నారి

పురుగుల మందు తాగి  ఆత్మహత్యాయత్నం

చికిత్స పొందుతూ మృతి

అనాథగా మారిన 11 నెలల చిన్నారి

సాక్షి, దండేపల్లి(మంచిర్యాల): అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందింది. దీంతో 11 నెలల చిన్నారి అనాథగా మారింది. ఎస్సై విజయ్‌కుమార్, మృతురాలి కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. దండేపల్లి మండలం పెద్దపేటకు చెందిన ఆముదాల ప్రసూణ(మహాతి) (21)కు వెల్గటూర్‌ మండలం స్తంభంపెలి్లకి చెందిన తర్ర రాకేష్‌తో 2017లో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.11లక్షల నగదు తోపాటు, రూ.4లక్షల బంగారు ఆభరణాలు, మరో రూ.2లక్షల సామగ్రిని కట్నంగా అందించారు. ఆ తరువాత అదనంగా మరో ఐదు లక్షలు కట్నం తేవాలని భర్త, అత్త, మామ, ఆడబిడ్డ మానసికంగా, శారీరకంగా వేధించారు.

ఈ విషయాన్ని తన తండ్రికి ఎప్పటికప్పుడు చెప్పింది. ఒప్పుకున్నకాడికి కట్నం ఇచ్చానని, అదనపు కట్నం ఇవ్వలేదనని బాధితురాలి తండ్రి చెప్పాడు. 2018లో ప్రసూణకు ఆడపాప జన్మించింది. అప్పటినుంచి ఆమెకు వేధింపులు మరింత పెరిగాయి. అదనపు కట్నం తేవాలని, లేకుంటే విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు. గదిలో బందించి దాడి చేశారు. విషయం తండ్రికి ఫోన్‌చేసి చెప్పడంతో 15రోజుల క్రితం తండ్రి తన కూతురిని పుట్టింటికి తీసుకువచ్చాడు. అయినా రాకేష్‌ పదేపదే ఫోన్‌చేసి కట్నం తీసుకురాకుంటే చచ్చిపో అని అనడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఈ నెల 8న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు.  మళ్లీ కరీంనగర్‌కు తీసుకువచ్చి చికిత్స అందిస్తుండగా బుధవారం మృతి చెందింది. దీంతో చిన్నారి పాప అనాథగా మారింది. తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

 
ప్రసూణ మృతదేహం..

మరిన్ని వార్తలు