వివాహిత దారుణ హత్య  

9 May, 2018 14:09 IST|Sakshi
తల్లి మృతదేహం వద్ద రోదిస్తున్న కుమార్తెలు

గొంతు కోసి చంపిన భర్త

మోద్గులగూడెంలో ఘటన

కురవి : కలకాలం తోడుండాల్సిన భర్తే.. తన భార్యను కత్తితో గొంతు కోసి అతి దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం కురవి మండలంలోని మోద్గులగూడెం శివారు జుర్‌జుర్‌తండా సమీపంలో చోటుచేసుకుంది. తండావాసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం మోద్గులగూడెం గ్రామ శివారు జుర్‌జుర్‌తండాకు చెందిన దారావత్‌ పద్మ (35), దారావత్‌ స్వామి దంపతులు తండాకు చెందిన దారావత్‌ రాములుకు చెందిన పది ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తూ జీవిస్తున్నారు.

వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారు. ఈ సారి పంటలు బాగాగానే పండాయి. స్వామి కౌలు కింద భూ యజమానికి ఇవ్వాల్సిన రూ.80 వేల డబ్బుల్లో రూ.50 వేలు చెల్లించాడు. ఇంకా రూ.30 వేలు చెల్లించాల్సి ఉంది. గత సోమవారం (7వ తేదీ) స్వామి పండించిన 104 బస్తాల ధాన్యాన్ని కౌలు డబ్బుల కింద భూ యజమాని రాములు ట్రాక్టర్‌లో తీసుకెళ్తున్నాడు. అయితే ఇవ్వాల్సిన రూ.30 వేలు వడ్డీతో సహా కడుతానని పంటను తీసుకెళ్లొద్దని స్వామి వేడుకున్నాడు. అయినా రాములు వినకుండా ధాన్యం బస్తాలను తండాకు తీసుకొచ్చారు. ఈ విషయమై మంగళవారం ఉదయం పంచాయితీ నిర్వహించారు.

అవమానం.. అనుమానం...

కౌలు డబ్బుల కింద రాములు ధాన్యం బస్తాలను ట్రాక్టర్‌లో వేసుకుని వెళ్తున్న క్రమంలో తన భార్య పద్మ నవ్విందని స్వామి పంచాయతీలో చెప్పాడు. ధాన్యం బస్తాలను తీసుకెళ్తుంటే తాను బతిమిలాడుతున్న సమయంలో భార్య వారించే యత్నం చేయకపోగా నవ్వడంతో అవమానంగా భావించానని, ఆమెను ఎలాగైనా చంపుతానని అన్నట్లు పంచాయితీ పెద్దలు తెలిపారు. పంచాయితీ ఎటూ తేలకపోవడంతో ఆగ్రహంతో స్వామి ఇంటికి వెళ్లాడు.

అక్కడ భార్య కనిపించకపోవడంతో మధ్యాహ్నం చేను వద్దకు వెళ్లాడు. వ్యవసాయ బావి వద్ద చెట్టు నీడలో నిద్రిస్తున్న పద్మ గొంతును కత్తితో కోసి అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు. కాగా, ఘటన స్థలాన్ని మరిపెడ సీఐ శ్రీనివాస్, సీరోలు ఎస్సై రాణాప్రతాప్‌ పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. 

శుభకార్యం జరిగిన 15 రోజులకే...

స్వామి తన భార్య పద్మకు తండాకు చెందిన  రాములుతో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతోనే హత్యకు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 15 రోజుల నుంచి ఇంట్లో పంచాయితీ గొడవలు జరుగుతున్నాయి. స్వామి పెద్ద కుమార్తె శ్యామలకు వివాహం నిశ్చయమైంది. పెళ్లి తర్వాత పంచాయితీ చేసుకుందామని చెప్పి తండా పెద్దలు బిడ్డ పెళ్లి జరిపించారు. బిడ్డ శ్యామల వివాహమై 15 రోజులైంది. ఇంతలోనే కౌలు కింద రాములు ధాన్యం తీసుకెళ్తుంటే స్వామి ఆయనను బతిమిలాడుతున్న సమయంలో భార్య పద్మ నవ్వడంతో ఇంకా అనుమానానికి బలం చేకూరింది. ఈ క్రమంలోనే భార్యను గొంతుకోసి కిరాతంగా చంపాడని తండావాసులు చర్చించుకుంటున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా