అనుమానాస్పద రీతిలో వివాహిత మృతి

26 Mar, 2020 08:52 IST|Sakshi
శవాన్ని బయటకు తీస్తున్న పోలీసులు       

83 రోజుల తర్వాత శవం వెలికితీత 

భర్త సహా ఆరుగురిపై కేసు నమోదు 

సాక్షి, కురబలకోట: మండలంలోని మట్లివారిపల్లె పంచాయతీ వనమరెడ్డిగారిపల్లె (పెద్దపల్లె)లో జనవరి 2వ తేదీ రాత్రి వివాహిత హత్యకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పొలంలో పూడ్చిపెట్టారు. అనంతరం ఆమె అదృశ్యమైనట్టు నాటకమాడారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు తెలిశాయి. మృతదేహాన్ని బుధవారం బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. దృశ్యం సినిమాను తలపించేలా హత్యను తప్పుదారి పట్టించేందుకు నిందితులు ఆడిన నాటకాన్ని చూసి పోలీసులు విస్తుపోయారు. రూరల్‌ సర్కిల్‌ సీఐ అశోక్‌కుమార్‌ కథనం మేరకు.. వనమరెడ్డిగారిపల్లెకు చెందిన మల్‌రెడ్డి (27) ఆర్టీసీ అద్దె బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం మదనపల్లెకు చెందిన బీటెక్‌ చదువుతున్న గాయత్రి (25) పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకుని ఆరు నెల ల క్రితం పెళ్లి చేసుకున్నారు. గాయత్రి కులం వేరు కావడంతో మల్‌ రెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లిని అంగీకరించలేదు. దీంతో అతను మదనపల్లెలో కాపురం పెట్టాడు. భార్యపై అనుమానం కలగడంతో ఇటీవల కాపురాన్ని స్వగ్రామానికి మార్చాడు. పోలీస్‌ స్టేషన్‌లో కూడా పంచాయితీ జరిగింది. వేరే కులం కావడం, ఆపై భార్యపై అనుమానం రావడంతో ఆమెను వదిలించుకోవాలని పథకం పన్నాడు. 

హరికథ రోజే హత్య 
వనమరెడ్డిగారిపల్లెకు చెందిన ఒక వ్యక్తి చనిపోవడంతో జనవరి 2వ తేదీన దివసం కార్యక్రమాల్లో భాగంగా హరికథా కాలక్షేపం ఏర్పాటు చేశారు. గ్రామస్తులు హరికథ దగ్గరకు వెళ్లడంతో మల్‌రెడ్డి, అతని కుటుంబ సభ్యులు కలిసి ఊపిరి ఆడకుండా చేసి గాయత్రిని హత్య చేశారు. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా అదే రోజు రాత్రి దగ్గరలోని పొలంలో పూడ్చిపెట్టారు. శవం పూడ్చిన ఆనవాళ్లు కని్పంచకుండా ట్రాక్టర్‌తో దున్నించారు.  

తిరుపతిలో సెల్‌ఫోన్‌ తిప్పారు 
పోలీసుల విచారణకు దొరక్కుండా మరుసటి ఉదయమే ఆమె సెల్‌ ఫోన్‌ను మరొకరి చేతికి ఇచ్చి తిరుపతిలోని బస్టాండ్, రైల్వే స్టేషన్‌ ప్రాంతాల్లో తిరిగొచ్చి ఆ తర్వాత సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశారు. పోలీసులు మొబైల్‌ సిగ్నల్‌ను ట్రాక్‌ చేస్తే తిరుపతి వెళ్లినట్లు తెలుస్తుందని ఇలా చేశారు. అనుకున్నట్లుగానే మదనపల్లె రూ రల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆమె అదృశ్యమైనట్లు భర్త జనవరి 6న ఫిర్యాదు చేశాడు. ఆమె సెల్‌ సిగ్న ల్స్‌ ఆ«ధారంగా చూస్తే తిరుపతి వెళ్లినట్లు వెల్లడైంది. మిస్టరీగా మారడంతో చివరకు సీటీఎం దగ్గరున్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో కీలక విషయం బయటప డింది. భార్య సెల్‌ఫోన్‌ను భర్తే మరొకరి చేతికి ఇచ్చి తిరుపతి బస్సు ఎక్కించినట్లు వెల్లడైంది. అతని కుటుంబ సభ్యులను విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

శవం వెలికితీత 
వనమరెడ్డిగారిపల్లె పొలాల్లో పూడ్చిన గాయత్రి మృతదేహాన్ని పోలీసులు బుధవారం బయటకు తీశారు. కుళ్లిన స్థితిలో ఉన్న శవానికి అక్కడే తహసీల్దార్‌ నీలమయ్య శవ పంచనామా చేశారు. డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. డీఎస్పీ రవి మనోహరాచారి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. భర్త మల్‌రెడ్డి, అతని తమ్ముడు కార్తీక్‌ రెడ్డి (25), కుటుంబ సభ్యులు అమరనాథరెడ్డి (27), గంగల్‌రెడ్డి, గంగిరెడ్డి, లక్ష్మిదేవమ్మపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.                                

మరిన్ని వార్తలు