అత్తింటివారి వేధింపులు భరించలేక..

25 Aug, 2019 20:51 IST|Sakshi

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎంవి66 గ్రామానికి చెందిన మహిళ ముక్తి సర్కార్‌ అత్తింటివారి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. ఎంవి 45 గ్రామానికి చెందిన అజిత్‌ గుప్తా కుమార్తె ముక్తికి ఎంవి 66 గ్రామానికి చెందిన శివ సర్కార్‌ అనే వ్యక్తితో 10 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. కోడలికి మగపిల్లవాడు పుట్టలేదని ముక్తి సర్కార్‌ను అత్త నిత్యం తీవ్రంగా వేధిస్తూ పుట్టింటి నుంచి అదనపు సొమ్ము తీసుకురావాలని తరచూ ముక్తి సర్కార్‌ను కన్నవారింటికి పంపించేది. మా వంశం ఇక్కడితో సరే. నీకు ఆడపిల్లలు పుట్టారు. మగ పిల్లలు పుట్టలేదని సూటిపోటి మాటలతో వేధిస్తుంటే తట్టుకోలేకపోయిన ముక్తిసర్కార్‌ మంగళవారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను వెంటనే కలిమెల ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మల్కన్‌గిరి ఆస్పత్రికి తరలించారు. మల్కన్‌గిరి ఆస్పత్రిలో శుక్రవారం సాయంత్రం వరకు వైద్యం అందజేసినప్పటికీ ఫలితం లేకపోయింది. 

విశాఖ తరలిస్తుండగా మృతి
పరిస్థితి విషమించడంతో విశాఖపట్నం ఆస్పత్రికి తరలిస్తుండగా విజయనగరంలో ముక్తి సర్కార్‌ మృతిచెందింది. విజయనగరం నుంచి ముక్తి సర్కార్‌ మృతదేహాన్ని కలిమెల ఆస్పత్రికి తీసుకువచ్చారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. భర్త, అత్త వేధింపులతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతురాలి భర్త శివ భాస్కర్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు