నరమేధం.. 50మంది రక్తపు మడుగులో

2 Oct, 2017 19:28 IST|Sakshi

న్యూయార్క్‌ : లాస్‌ వేగాస్‌ భారీ నరమేధమే చోటు చేసుకుంది. తాజాగా అందిన సమాచారం సాయుధుడి కాల్పుల్లో దాదాపు 50మంది మృత్యువాత పడినట్లు సమాచారం. వందలాదిమంది గాయాలపాలయ్యారని, వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. కాల్పులు జరిపింది ఇద్దరు వ్యక్తులని తెలుస్తోంది. లాస్‌ వేగాస్‌లో ఆదివారం అర్ధరాత్రి ఓ సాయుధుడు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో తొలుత ఇద్దరే చనిపోయినట్లు తెలిసినా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 50మంది పైగా చనిపోయారు. లాస్‌ వేగాస్‌ స్ట్రిప్‌లో దేశీయ సంగీత ఉత్సవం జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంగీత విభావరి జరుగుతున్న మాండలై బే హోటల్‌లో సాయుధుడు ఒక్కసారిగా కాల్పలకు తెగబడ్డాడు.

దీంతో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు భయభ్రాంతులకు గురై.. ప్రాణాలు దక్కించుకునేందుకు ఒక్కసారిగా పరుగులు తీశారు. సంఘటనా స్థలంలో భీతావహ పరిస్థితి నెలకొంది. కాల్పుల గురించి సమాచారం అందడంతో వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. కాల్పులకు తెగబడ్డ సాయుధుడిని హతమార్చినట్టు లాస్ వేగాస్‌ పోలీసులు ధ్రువీకరించారు. అయితే, మరొకరు ఉన్నట్లు సమాచారం. ఆ వ్యక్తి ఒక మహిళ అని, ఆమెకోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే గుర్తింపు కార్డు లేని వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. లాస్‌ వేగాస్‌ లోపలికి వచ్చే మార్గాలన్నంటిని మూసి వేసి హై అలర్ట్‌ విధించారు.

మరిన్ని వార్తలు