వరంగల్‌ గ్రానైట్‌ కంపెనీలో భారీ పేలుడు

26 Sep, 2019 14:39 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : పొట్ట కూటి కోసం కూలి పనికి పోయిన పేదల బతుకులు చెల్లాచెదురయ్యాయి. వెంట తెచ్చుకున్న మెతుకులు తినకముందే బతుకులు చిందరవందరగా మారాయి. రోజులాగే పనిచేస్తున్న చోటే ఎవరూ ఊహించిన రీతిలో పిడుగు పడినట్లుగా శబ్దంతో కూడిన పేలుడు సంభవించడం... ఏమైందో తెలుసుకునే లోపే తెగిపడ్డ అవయవాలను చూసి బాధితుల గుండెలు అవిసేలా రోదించారు.

కాజీపేట మండలం రాంపూర్‌ ఇండస్ట్రియల్‌ ప్రాంతంలోని వజ్ర మ్యాట్రిక్స్‌లో గురువారం ఉదయం 10.46 గంటలకు భారీ పేలుడు సంభవించించగా ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సందర్భంగా షెడ్డు రేకులు పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు భారీ శబ్దం రావడంతో పేలుడు పదార్థాలు ఉన్నాయా.. ఉంటే ఎందుకు తీసుకొచ్చారు.. గ్రానైట్‌ రాళ్లను పాలీష్‌ చేసేందుకు ఉపయోగించే బిట్స్‌ తయారీ పరిశ్రమ పేరిట ఇందులో ఏం చేస్తున్నారనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఆధారాలు సేకరించిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

ముక్కలు ముక్కలు
వజ్ర మ్యాట్రిక్స్‌లో పేలుడు సమయంలో వెలువడిన భారీ శబ్దం రాంపూర్‌ గ్రామం వరకు వినిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అంతలోపే బాధితుల కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో వారితో పాటు గ్రామస్తులు చేరుకున్నారు. అప్పటికే గాయాలతో విలవిలాడుతున్న బాధితులను వజ్ర మ్యాట్రిక్స్‌ యాజమానితో పాటు సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. పేలుడు సమయంలో ముగ్గురు స్త్రీలతో పాటు ఇద్దరు పురుషులు పనిచేస్తున్నారు. వీరిలో మహిళలు గాయపడగా.. దూరంగా ఉన్న పురుషులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. పేలుడు ధాటికి కంపెనీలో ఉన్న వస్తువులు చెల్లాచెదురు కావడంతో పాటు పైకప్పు రేకులు ముక్కలుముక్కలయ్యాయి. కిటికీ అద్దాలు మొత్తం పగిలిపోగా షట్టర్‌ ఓ పక్కకు వంగిపోవడం పేలుడు తీవ్రతను చెబుతోంది.

తెగిపడిన కాలు తొలగింపు
పేలుడులో గాయపడిని నాయిని స్వరూప, నాయిని రజితను రోహిని ఆస్పత్రికి తీసుకువచ్చేటప్పటికీ స్వరూప కుడికాలు మోకాలు కింది భాగం వరకు నుజ్జునుజ్జు అయింది. దీంతో డాక్టర్లు తెగిపోయిన భాగాన్ని వేరు చేశారు. ఆమెకు ముఖంపై కూడా బలమైన గాయాలయ్యాయి. ఇక స్వరూపతో పాటు రజితకు చికిత్స చేసి ఐసీయూ విభాగానికి తరలించారు. తీవ్ర గాయాలైన కంటి ప్రియాంకను ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. తొలుత ప్రియాంకను రోహిణి ఆస్పత్రికి తీసుకెళ్లగా గాయాల తీవ్రత దష్ట్యా వైద్యులు చేర్చుకోలేదని సమాచారం. ఎంజీఎంకు తీసుకెళ్లాక పరిస్థితి తీవ్రంగా ఉండడంతో హైదరబాద్‌ నిమ్స్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో ప్రియాంక కుటుంబ సభ్యులు ఆమెను నిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లినా పరిస్థితి తీవ్రత దష్ట్యా వైద్యులు చేర్చుకోకపోవడంతో గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు.

బిట్స్‌ తయారు
వజ్ర మ్యాట్రిక్స్‌ కంపెనీలో గ్రాðనైట్‌ రాళ్లను పాలిష్‌ చేయడానికి ఉపయోగించే బిట్స్‌ తయారుచేస్తారు. గురువారం ఐదుగురు పనికి వచ్చారు. గాయపడిన ముగ్గురు మహిళలు బిట్స్‌ను గమ్‌(బంక)తో అంటిస్తుండగా పేలుడు సంభవించింది. డైమండ్‌ పౌడర్‌తో పాటు మరో రెండు రసాయన పదార్థాలు కలిపి మిషన్‌పై వివిధ పరిమాణాలలో బిట్స్‌ తయారు చేస్తారు. ముందే నిర్దేశించిన పరిమాణంలో రసాయనాలను వినియోగించాల్సి ఉంటుంది. బిట్స్‌ తయారీకి వినియోగించే పదార్థాలకు పేలుడు స్వభావం ఉండదని చెబుతున్నారు. కాగా, బిట్స్‌ను రాజస్థాన్, ఒంగోలుతో పాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తారు. కంపెనీలో నాలుగు మిషన్లు ఉండగా గురువారం మూడు మిషన్లను మాత్రమే ఆన్‌లో ఉన్నాయి. ఒక మిషన్‌లో ఆటోమేటిక్‌ ఆఫ్‌ అండ్‌ ఆన్‌ సమస్య వస్తే తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాకు చెందిన ఎలక్ట్రీషియన్‌ తంబ రెండు రోజుల క్రితం వచ్చి రిపేర్‌ చేశారు. ప్రమాద సమయంలో తంబ కూడా కంపెనీలోనే ఉన్నాడు. 

రంగంలోకి క్లూస్‌ టీం
పేలుడు సంభవించిన స్థలానికి లో క్లూసీ టీం సభ్యులు చేరుకుని నమూనాలు సేకరించారు. బిట్స్‌ తయారీకి సంబంధించి ఉపయోగించే డైమండ్‌ పౌడర్‌తో పాటు మరో రెండు రసాయనాల శాంపిల్స్‌ సేకరించారు. బిట్స్‌తో పాటు బాధితుల సెల్‌ఫోన్లు కూడా సేకరించారు. క్లూస్‌ టీం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నమునాలు సేకరించగా బాంబుస్క్వాడ్‌ బందం కూడా పరిశీలించింది.

మిక్సింగ్‌ రూమ్‌లో ఏం ఉంది?
బిట్స్‌ తయారీకి వినియోగించే పదార్థాలను ఒక గదిలో ఉంచారు. అందులో వివిధ రకాల సైజు బిట్స్‌ తయారీకి ఏ పదార్థం ఎంత మోతాదులో వినియోగించాలో నిర్ధారించి కలిపాకే మిషన్లపైకి తెస్తారు. మ్యాట్రిక్స్‌ కంపెనీలో 200, 400, 600, 800, 1500, 3000 రకాల బిట్స్‌ తయారుచేస్తారు. బిట్స్‌లో వినియోగించే పదార్థాలకు పేలుడు స్వభావం ఉంటే ప్రెషర్‌ మిషన్‌పై పేలొచ్చని భావిస్తున్నారు. కానీ బిట్స్‌ పూర్తిగా చల్లారాకే ప్లాస్టిక్‌ కవర్లు(గ్రిప్‌) గమ్‌తో అంటిస్తారు.

గురువారం ఇదే పని చేస్తుండగా పేలుడు సంభవించింది. దీంతో అసలు ఎలా జరిగిందంనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. సాధారణంగా మిక్సింగ్‌ రూమ్‌లోకి ప్రియాంక, స్వరూప వెళ్తారని తెలిసింది. ఈ మేరకు క్లూస్‌టీం బందం శాంపిల్స్‌ సేకరించగా.. బిట్స్‌ తయారీ పదార్థాల్లో పేలుడు స్వభావం కలిగినవి ఉంటే మాత్రం ఎలాంటి అనుమతులు లేనందున యాజమాన్యం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు