మరో బురారీ : బిహార్‌ నుంచి వలస వచ్చి...

30 Jul, 2018 15:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాంచీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలోని బురారీ సామూహిక ఆత్మహత్యల మిస్టరీ వీడకముందే జార్ఖండ్‌లో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాంచీలోని కంకే ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సోమవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ​చనిపోయిన వ్యక్తులను దీపక్‌, అతడి భార్య, తల్లిదండ్రులు, ఐదేళ్ల కూతురు, ఏడాదిన్నర కొడుకుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు ఉరివేసుకోగా, మిగతావారి శవాలు ఓ గదిలో నేలపై పడి ఉన్నట్లు వెల్లడించారు.

వివరాలు... బిహార్‌లోని భగల్‌పూర్‌కు చెందిన దీపక్‌ ఝా అనే వ్యక్తి కుటుంబంతో సహా వచ్చి రాంచీలో స్థిరపడ్డాడు. ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ​కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే మానసికంగా కుంగిపోయిన దీపక్‌ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభించకపోవడంతో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఎస్‌పీ అనీష్‌ గుప్తా తెలిపారు. కాగా కొన్ని రోజుల క్రితం జార్ఖండ్‌లోని హజారీ బాగ్‌లో కూడా ఇదే తరహాలో మహవీర్‌ మహేశ్వరీ అనే వ్యక్తి వ్యాపారంలో నష్టం రావడంతో కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు