గురువా... ఇది పరువా..

26 Feb, 2019 10:09 IST|Sakshi
సీఐ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేస్తున్న బాధిత ఉపాధ్యాయినులు

మహిళా టీచర్లకు అసభ్యకర సందేశాలు పంపిన ఉపాధ్యాయుడు

కంటకాపల్లి జెడ్పీ హైస్కూల్‌ గణిత ఉపాధ్యాయుడు వెంకటనాయుడి పైశాచిక చర్యలు

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత ఉపాధ్యాయినులు

విజయనగరం  ,కొత్తవలస: తల్లితండ్రుల తర్వాత అంతటి గౌరవాన్ని ఉపాధ్యాయులకు ఇచ్చింది మన సమాజం. కాని సభ్య సమాజం సిగ్గుపడేలా సాటి మహిళా ఉపాధ్యాయినులకు అభ్యంతకర మెసేజ్‌లు పంపిస్తూ ఉపాధ్యాయ వృత్తికే మచ్చతెచ్చాడు ఓ ఉపాధ్యాయుడు. అతని వేధింపులు భరించలేక బాధిత ఉపాధ్యాయినులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే... మండలంలోని కంటకాపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న జి. వెంకటనాయుడు అభ్యంతకర మెసేజ్‌లతో మహిళా ఉపాధ్యాయులను వేధిస్తున్నాడు. ఓ దాత మీ పాఠశాలకే రెండు కంప్యూటర్లు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని దిగువ ఎర్రవానిపాలెం పాఠశాల ఉపాధ్యాయిని హెచ్‌. రమాదేవికి.. ఎర్నడ్‌ లీవ్‌ చేయించుకోవడంలో ఎంఈఓను బాగానే మేనేజ్‌ చేశావంటూ కొత్తవలస పాఠశాల ఉపాధ్యాయురాలు హెచ్‌. శోభారాణికి వెంకటనాయుడు మెసేజ్‌లు పంపించాడు. 

అలాగే చీడివలస పాఠశాల హెచ్‌ఎం బంగారుపాపను ఉద్దేశిస్తూ ఎన్నిసార్లు అవార్డులు తీసుకుంటావంటూ మెసేజ్‌లతో వేధిస్తున్నాడు. బంగారుపాపకు జిల్లా స్థాయి అవార్డు రావడంతో ఇటీవల మండల కేంద్రంలో జరిగిన అభినందన సభలో కూడా తక్కువ చేసి మాట్లాడినట్లు బాధిత ఉపాధ్యాయురాలు తెలిపింది. ఈ మేరకు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ముగ్గురు మహిళా ఉపాధ్యాయినులు పోలీసులను ఆశ్రయించారు. తోటి ఉపాధ్యాయులు, ఆయా గ్రామాల ప్రజలతో కలిసి పోలీస్‌స్టేషన్‌ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా వెంకటనాయుడు ఆగడాలను బాధిత ఉపాధ్యాయినులతో పాటు తోటి ఉపాధ్యాయులు చుక్క ఈశ్వరఅప్పారావు, బి. శ్రీనివాసరావు, నాగభూషణరావు, పి. రవి, బి. రామకృష్ణారావు, తదితరులు సీఐకి వివరించారు. కులంపేరుతో తక్కువగా మాట్లాడుతున్నాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎమ్మెల్యే బంధువు కావడంతో..
ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటనాయుడు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి బంధువులు కావడంతో అందరినీ బెదిరిస్తున్నాడని పలువురు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం అతడ్ని పిలిచి విచారించలేదని బాధిత మహిళలు వాపోయారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయమై సీఐ ఆర్‌. శ్రీనివాసరావు మాట్లాడుతూ, నిందితుడితో పాటు గ్రూప్‌ అడ్మిన్‌ సోలురాజును పిలిచి విచారిస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తలు