కారును తగలబెట్టిన యువకుడి అరెస్ట్‌

26 Sep, 2019 13:44 IST|Sakshi

లక్నో: ఓ వ్యక్తి సడెన్‌గా కారు నుంచి దిగి.. దానికి నిప్పంటించాడు.. ఆపడానికి ప్రయత్నించిన జనాలను తుపాకీతో బెదిరించడంతో పోలీసులు అతడిని, అతనితో పాటు ఉన్న యువతిని అరెస్ట్‌ చేశారు. మధురలో జరిగిన ఈ సంఘటన వివరాలు.. శుభం చౌదరి అనే యువకుడు, ఓ యువతితో కలిసి కారులో ప్రయాణం చేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు ఉన్నట్టుండి ఆ యువకుడు కారు నుంచి దిగి.. దానికి నిప్పంటించాడు. అదుపు చేయడానికి వచ్చిన వారిని గన్నుతో బెదిరిస్తూ.. గాల్లోకి కాల్పులు జరిపి వీరంగం సృష్టించాడు. అతడి చర్యల వల్ల ట్రాఫిక్‌ జాం అయ్యి.. జనాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్డు మీద న్యూసెన్స్‌ క్రియేట్‌ చేయడమే కాక.. కాసేపు అవినీతి గురించి ఉపన్యసించాడు. ఈ లోపు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శుభం చౌదరిని, అతడితో పాటు ఉన్న యువతిని అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు కారును ఎందుకు తగలబెట్టావని శుభం చౌదరిని ప్రశ్నించగా అతడు పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అంతేకాక తనతో పాటు ఉన్న యువతిని కాసేపు తన చెల్లెలు అని, కాసేపు బిజినేస్‌ పార్టనర్‌ అని, కాసేపు ఫ్రెండ్‌ అన్నాడు. శుభం చౌదరి మాటలు విన్న పోలీసులు అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని భావిస్తున్నారు. మరో సమాచారం ఏంటంటే శుభం చౌదరికి వేరే మహిళతో వివాహం నిశ్చయమైందని.. కానీ కారులో ఉన్న యువతితో అతనికి సంబంధం ఉండటం మూలానా ఆ పెళ్లి క్యాన్సిల్‌ అయిందని... దాంతో శుభం చౌదరి డిప్రెషన్‌లోకి వెళ్లాడని.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడని తెలిసింది. దీని గురించి పోలీసులను ప్రశ్నించగా.. పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు