మంత్రి ఇలాఖాలో మంగతాయి

23 Nov, 2017 10:49 IST|Sakshi

గండికోటలో జూద స్థావరంపై పోలీసుల దాడులు

నగదు స్వాధీనం మొదలుకుని కేసుల వరకు అన్నీ అనుమానాలే

ఆడేవారిని వదిలి బీనామీలపై కేసులు పెడుతున్న పోలీసులు

సాక్షి కడప : రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సొంత నియోజకవర్గంలో మంగతాయి జోరు పెరిగింది. రూ.వేలు, లక్షలు దాటి కోట్లకు చేరింది. మంత్రి ఇలాఖా అయిన జమ్మలమడుగు ప్రాంతంలో ప్రతినిత్యం జూదం జోరందుకున్నా నోరు మెదిపే వారు కరువయ్యారు. ఎవరైనా పోలీసులు సాహసం చేసి దాడులు నిర్వహిస్తే తాము మంత్రి వర్గీయులమంటూ బెదిరిస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే జమ్మలమడుగు ప్రాంతంలో మట్కాతోపాటు జూదం ఆడేందుకు రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూడా వస్తున్నారు.  గండికోట పర్యాటక క్షేత్రాన్ని స్థావరంగా ఏర్పరుచుకుని వ్యవహారం చక్కబెడుతున్నారు. ఒకరోజు ఒకచోట, మరొకరోజు మరో ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని అడ్డంగా ఆడుతున్నారు. అయితే మంగళవారం గండికోటలోని జూద స్థావరంపై పోలీసుల దాడి సంచలనం కలిగించినా.. తర్వాత అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లతో కేసు వ్యవహారం కాస్తా పక్కకు మళ్లడం ఆందోళన కలిగిస్తోంది.

అన్నీ అనుమానాలే..
జమ్మలమడుగు పరిధిలోని గండికోటలో మంగతాయి ఆడుతున్న జూదరులను పట్టుకోవడం...వారి వద్దనుంచి భారీగా మొత్తాలు స్వాధీనం చేసుకున్న విషయం వరకు పరిశీలిస్తే పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే పట్టుబడిన సొమ్ముతోపాటు పోలీసులకు చిక్కిన జూదరులలో కొంతమందిని తప్పిస్తున్నారని తెలియవచ్చింది. రూ.70 లక్షల వరకు నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాల్లోనే చర్చ సాగుతోంది. అంతేకాకుండా ఆ శాఖలోని నిఘా వర్గాలు కూడా దాదాపు కోటి రూపాయల మేర వ్యవహారం సాగినట్లు లెక్కలు కడుతున్నారు. అయితే దొరికిన లెక్కకు పక్కా లెక్కలు ఉండవనుకున్నారో...లేదా అధికార పార్టీ ఒత్తిడితో ఏదో ఒకటి చేశామని చెప్పుకున్నారో తెలియదుగానీ నగదు వ్యవహారం కాస్త జమ్మలమడుగులో హాట్‌ టాపిక్‌ అయింది. గండికోటలో జరుగుతున్న జూదం వ్యవహారంలో దాదాపు 50 మంది వరకు పాల్గొనగా. .దాదాపు రెండు కోట్ల మేర అందరి వద్ద నగదు ఉన్నట్లు బయట ప్రచారం సాగుతోంది. అయితే పోలీసులు మాత్రం కేవలం రూ. 30 లక్షలు మాత్రమే చూపించడాన్ని బట్టి పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది.

జమ్మలమడుగు కేంద్రంగా..
రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖా మంత్రి ఆది సొంత నియోజకవర్గంలో మొబైల్‌ గ్యాంబ్లింగ్‌ ఎక్కువగా జరుగుతుంది. గండికోట, కర్నూల్, నంద్యాల, బెంగళూరు ప్రాంతాలను ఎంపిక చేసుకుని గ్యాబ్లింగ్‌ నిర్వహిస్తున్నారు. వీరు ప్రతి రోజు ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతంలో పోలీసులు ఎవరూ రాకుం డా ప్రత్యేక  మనుషులతో వలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కోట్లలో మంగతాయి నిర్వహిస్తున్నారు. ఎవరైనా పోలీసులు వస్తే వారికి తాము మం త్రి అనుచరులమంటూ చెబుతూ బెది రింపులకు దిగుతున్నారు. దీంతో చాలా మంది పోలీసు అధికారులకు జూదం వ్యవహారం తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

దొరికింది రూ.30 లక్షలా 72 లక్షలా!
గండికోటలో మంగళవారం అర్ధరాత్రి మొబైల్‌ గ్యాంబ్లింగ్‌లో భాగంగా కొంత మంది మంగతాయి నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు మారువేషాల్లో వెళ్లి( మఫ్టీలో) వారిని పట్టుకున్నారు. అయితే మంగతాయి ఆడేవారు దాదాపు 52 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరి వద్ద నుంచి దాదాపు 72 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం తాము స్వాధీనం చేసుకుంది కేవలం రూ.30లక్షల 31వేలు మాత్రమే అని చెబుతున్నారు. అయితే పేకాట ఆడటానికి వెళ్లేవారు ఒక్కొక్కరు కనీసం మూడు లక్షలరూపాయలు దగ్గర పెట్టుకుని వెళితోనే లోపలికి ప్రవేశం ఉంటుంది. ఈ లెక్కన 51 మంది వద్ద కనీసం రెండు కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

ఎదురుతిరిగిన జూదరులు
గండికోట టూరిజం హోటల్‌లో మంగతై ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు మఫ్టీలో వెళ్లి పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అందులో డబుల్‌ స్టార్‌ కలిగిన అధికారులపై జూదరులు దౌర్జనానికి పాల్పడటంతో పాటు వాదనకు దిగినట్లు తెలిసింది. ఎట్టకేలకు జూదరులను అదుపులోకి తీసుకోగా వారిలో చాలా మంది ప్రధాన వ్యక్తులే ఉన్నారని తెలుస్తోంది. అయితే వారిని కాకుండా వారు సూచించిన వ్యక్తులను కేసులో పెట్టేలా అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా స్థాయి అధికారులు కేసులు పెట్టిన 21 మందిని విచారిస్తే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.

రూ.30 లక్షలు స్వాధీనం
జమ్మలమడుగు: గండికోటలోని హరిత హోటల్‌లో మంగతై జూదం ఆడుతున్న 21మందిని అరెస్టు చేసి వారి వద్దనుంచి 30 లక్షల 31,900 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు జమ్మలమడుగు అర్బన్‌ సీఐ ప్రవీన్‌కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధిలోని గండికోట టూరిజం హోటల్‌లో మంగతై ఆడుతున్నట్లు సమాచారం రావడంతో రూరల్‌ సీఐ ఉమామహేశ్వరరెడ్డి, ఎస్‌ఐలు హనుమంతు, హరిప్రసాద్, సునీల్‌రెడ్డి, రాఘవేంద్రారెడ్డి, శ్రీనివాసులు, నరసింహారెడ్డిలతో పాటు స్పెషల్‌ పార్టీ పోలీసులతో కలిసి దాడి నిర్వహించామన్నారు.  ఇందులో తమ్మినేని వెంకటేశ్వర్లు, ఉప్పలూరు నాగేశ్వరరెడ్డి, టంగుటూరు కృష్ణమూర్తి, దూదేకుల దస్తగిరి, మాధవాపురం రవికుమార్, నారాయణ, తప్పెట్ల రామసుబ్బారెడ్డి, వేంపల్లి సుబ్బారెడ్డి, వెన్నపూస శ్రీనివాసుల రెడ్డి, లింగాల గారి వెంకటసుబ్బయ్యలతోపాటు మరో11 మందిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు