మట్కారాయుడి కాంట్రాక్టర్‌ ముసుగు

18 Mar, 2020 13:17 IST|Sakshi
మాట్లాడుతున్న ఆదోని డీఎస్పీ రామకృష్ణ

గంజాయి కూడా విక్రయం

కటకటాలపాలైన ఎమ్మిగనూరు యువకుడు

ఆదోని టౌన్‌: రోడ్లు వేసే కాంట్రాక్టర్‌నని నమ్మించి ఓ యువకుడు స్థానిక టీజీఎల్‌ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కాంట్రాక్టర్‌ ముసుగులో ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో మట్కా రాస్తూ, అవసరమైన వారికి గంజాయి విక్రయిస్తూ పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యాడు. నిందితుడి వివరాలను మంగళవారం డీఎస్పీ రామకృష్ణ తన బంగ్లా వద్ద విలేకరులకు వెల్లడించారు. ఎమ్మిగనూరు పట్టణంలోని మేకల బజార్‌లో నివాసముంటున్న అదిమి మోహన్‌కుమార్‌ కాంట్రాక్టర్‌ ముసుగులో మట్కా రాయడం, గంజాయిని విక్రయి స్తూ నెలకు వేలకు వేలు సంపాదిస్తున్నాడు. ఇటీవల ఆదోని పట్టణంలోని టీజీఎల్‌ కాలనీకి మకాం మార్చాడు. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అసాంఘిక కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడు.

స్థానికుల సమాచారంతో వన్‌టౌన్‌ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ కేపీ ప్రహ్లాద్, సిబ్బంది మంగళవారం వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు గుట్టు బయటపడింది. మొబైల్‌లో కోడ్‌భాష వినియోగిస్తూ వాట్సాప్, వాయిస్‌ కాల్స్‌ ద్వారా మట్కా లావాదేవీలను నిర్వహిస్తున్నట్లు విచారణలో అంగీకరించాడు. నెలకు దాదాపు రూ.5లక్షలకు పైగానే ఆదా యం ఆర్జిస్తున్నట్లు తెలుసుకుని పోలీసులే అవాక్కయ్యారు. అదనపు పనిగా కావాల్సిన వారికి గంజాయి కూడా సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. మోహన్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసి, అతని వద్ద నుంచి రూ.66 వేల నగదు, 190 గ్రాముల గంజాయి, మట్కా చీటీలు, మోటార్‌ సైకిల్, 4ఏటీఎం కార్డులు, 5 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ చెప్పారు. కేసును ఛేదించిన ఎస్‌ఐ ప్రహ్లాద్, ఇద్దరు కానిస్టేబుళ్లకు డీఎస్పీ, సీఐ నగదు రివార్డును అందజేశారు.    

మరిన్ని వార్తలు