మదర్సాలో అత్యాచారం.. మౌల్వీ అరెస్ట్‌

28 Apr, 2018 20:43 IST|Sakshi
మౌల్వీ ఇంటి వద్ద పోలీస్‌ బందోబస్తు

లక్నో: కథువా, సూరత్‌, ఉన్నావ్‌ ఘటనలు మరిచిపోక ముందే మరో అఘాయిత్యం చర్చనీయాంశంగా మారింది. పదేళ్ల బాలికను మదర్సాలోకి లాక్కెల్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన యూపీని కుదిపేస్తోంది. ఈ ఘటనతో ఘజియాబాద్‌లో అలజడి చెలరేగగా.. ఆందోళనకారుల డిమాండ్‌తో మదర్సా మౌల్వీ.. గులామ్‌ షాహిద్‌ను  పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ కమిషనర్‌(క్రైమ్‌బ్రాంచ్‌)రామ్‌ గోపాల్‌ నాయక్‌ ధృవీకరించారు. 

అసలేం జరిగింది... ఏప్రిల్‌ 21న ఇంటి నుంచి మార్కెట్‌కు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఓ యువకుడు ఆమెను ఆటోలో తీసుకెళ్లటం పోలీసులు గుర్తించారు. ఆ టీనేజర్‌ బాలిక కుటుంబానికి తెలిసిన వ్యక్తే. దీంతో అతని ఫోన్‌ కాల్‌ ఆధారంగా మదర్సాపై మెరుపుదాడి చేశారు. ఆ సమయంలో టీనేజర్‌, మౌల్వీతోపాటు మరో ఇద్దరు అక్కడ ఉన్నారు. ఆ బాలికను చాపలో చుట్టి ఉంచారు. బాలిక అత్యాచారానికి గురైనట్లు గుర్తించిన పోలీసులు.. ఆమె నుంచి వాంగ్మూలం సేకరించి టీనేజర్‌ను అరెస్ట్‌ చేశారు.

మౌల్వీ అరెస్ట్‌కు డిమాండ్‌.. ఈ వ్యవహారం వెలుగులోకి రాగా.. ఒక్కసారిగా మతం రంగు పులుముకుంది. బుధవారం చిన్నగా మొదలైన ఆందోళనలు శుక్రవారం ఉదయానికి తారా స్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మౌల్వీని అరెస్ట్‌ చేయాలంటూ హిందూ అతివాద సంఘాలు ధర్నాలు చేపట్టాయి. హైవేలను దిగ్భందించి నిరసనలు తెలిపాయి. చివరకు బీజేపీ ఎమ్మెల్యే సునీల్‌ కుమార్‌ శర్మ.. సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది. పరిస్థితులు చేజారుతుండటంతో శుక్రవారం సాయంత్రం గులామ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

నా భర్త అమాయకుడు.. అయితే పోలీసులు మదర్సాపై దాడి చేసిన సమయంలో తన భర్త అక్కడ లేడని మౌల్వీ భార్య మీడియాకు చెబుతున్నారు. ఘటన వెలుగులోకి వచ్చాక కొందరు జై శ్రీరామ్‌ నినాదాలు చేస్తూ తమ ఇంటిపై దాడి చేశారని.. తన భర్తను తగలబెడతామని బెదిరించారని ఆమె తెలిపారు. శుక్రవారం ఉదయం ఇంటిపై దాడి జరగ్గా.. సాయంత్రానికి పోలీసులు వచ్చి తన భర్తను అరెస్ట్‌ చేశారని ఆమె వివరించారు. మరోవైపు బాలిక వాంగ్మూలంపై పోలీసులు స్పష్టత ఇవ్వకపోవటంతో అనుమానాలు నెలకొన్నాయని మౌల్వీ భార్య చెబుతోంది. తన భర్త అమాయకుడని.. ఆయన్ని అనవసరంగా ఇరికించాలని చూస్తున్నారని ఆమె అంటోంది.

మరిన్ని వార్తలు