ఎంబీఏ విద్యార్థి అనుమానాస్పద మృతి

15 Sep, 2018 13:07 IST|Sakshi
లోకేష్‌ (ఫైల్‌)

నెల్లూరు, దొరవారిసత్రం: కుటుంబానికి తన కుమారుడు అండగా ఉంటాడని భావించిన ఆ తండ్రిని విధి చిన్నచూపు చూసింది. ఏం జరిగిందో గానీ ఎంబీఏ ఆఖరి సంవత్సరం చదువుతున్న సర్వేపల్లి లోకేష్‌ (21) ఇంటినుంచి వెళ్లిపోయిన నాలుగురోజుల తర్వాత అటవీ ప్రాంతంలో శవమై కనిపించాడు. పోలీసులు, గ్రామస్తులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కల్లూరు గ్రామానికి చెందిన సర్వేపల్లి భాస్కర్, గౌరీ దంపతులకు లోకేష్, సౌజన్య సంతానం. గౌరీ అనారోగ్యంతో ఐదేళ్ల ఏళ్ల క్రితం మృతిచెందింది. భాస్కర్‌ మూడేళ్ల క్రితం కుమార్తెకు వివాహం చేశాడు. లోకేష్‌ సూళ్లూరుపేటలో ఎంబీఏ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఈనెల 10వ తేదీన అతను కాలేజీకి వెళ్లాడు.

తర్వాత ఇంటికి వచ్చి సాయంత్రం నాలుగు గంటల వచ్చి లుంగీ కట్టుకుని వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో భాస్కర్‌ గ్రామస్తుల సాయంతో రెండురోజులు పాటు వెతికాడు. ఆచూకి లేకపోవడంతో 12వ తేదీన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 13వ తేదీ గురువారం సాయంత్రం గ్రామానికి సమీపంలో అటవీ ప్రాంతంలో తెలుగుగంగ 14ఆర్‌ మేజర్‌ కాలువ దగ్గర ఓ వ్యక్తి గేదెలను మేపుతున్న సమయంలో మృతదేహాన్ని గుర్తించి గ్రామస్తులకు చెప్పారు. మృతదేహం బాగా ఉబ్బిపోయి ఉండటంతో దుస్తులను బట్టి లోకేష్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న నాయుడుపేట సీఐ మల్లికార్జునరావు, ఎస్సై ఎం.వెంకట్రావ్‌ ఘటనా స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. శవపంచనామ నిమిత్తం మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు