వైద్యవిద్యార్థి ఆత్మహత్య!

30 Jul, 2019 09:00 IST|Sakshi
మృతుడు వైద్య విద్యార్థి పుష్పం నాయక్‌ (ఫైల్‌)

సమగ్ర విచారణకు ఆదేశించిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని 

సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : ఏలూరు సమీపంలోని ఆశ్రం  వైద్య కళాశాలలో సోమవారం సాయంత్రం ఒక వైద్య విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన జి.పుష్పం నాయక్‌ ఏలూరు ఆశ్రం వైద్యకళాశాలలో చదువుతున్నాడు. అతను తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించాడు. ఈ ఘటనపై అతని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకూ తమతో మాట్లాడిన తమ కుమారుడు సాయంత్రానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నామని పోలీసులకు చెప్పారు.  

అసలేం జరిగిందంటే : 
ఆశ్రం వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్న గుగ్గులోతు పుష్పంనాయక్‌ ఓల్డ్‌ బాలుర హాస్టల్‌ గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు దుప్పటితో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. సహ విద్యార్థులు చూసే సరికి విద్యార్థి  పుష్పం నాయక్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించటంతో వారు ఆశ్రం ఆసుపత్రిలోని క్యాజువాలిటీకి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్థారించారు.  కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన పుష్పం నాయక్‌ సోమవారం మధ్యాహ్నం తోటి విద్యార్థులతో కలసి ద్వితీయ సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్నాయి.

సోమవారం ఫార్మాకాలజీ, ఫార్మాసిక్‌ మెడిసిన్‌ రెండు పరీక్షలు రాసి సహ విద్యార్థులతో కలిసి ప్రాంగణంలోని హాస్టల్‌ గదికి వెళ్ళాడు. సాయంత్రం 4గంటల ప్రాంతంలో సహ విద్యార్థులంతా బయటకు వెళ్ళటంతో ఒక్కడే గదిలో ఉన్న ఫ్యాన్‌కు దుప్పటితో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటికి గదికి వచ్చిన సహ విద్యార్థులు ముందుభాగంలో తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా మూసి ఉండడంతో వెనుకవైపు నుంచి గదిలోకి వచ్చారు. అప్పటికే పుష్పం నాయక్‌ ఉరివేసుకుని ఉండడంతో ఆతడ్ని కిందికి దించి క్యాజువాలిటీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. 

మార్కులు తక్కువ రావటమే కారణమా?
విద్యార్థి ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.   పరీక్షల్లో మార్కులు తక్కువ రావటమే కారణమా, లేక ఇతర కారణాలు ఉన్నాయా అనేదానిపై ఆరా తీస్తున్నారు.  ప్రేమ వ్యవహారం కూడా ఒక కారణం కావచ్చని భావిస్తున్నారు.  

కుమారుడి మృతిపై సందేహాలు 
పుష్పం నాయక్‌ ఆత్మహత్యపై తనకు అనుమానాలు ఉన్నాయంటూ తండ్రి బాలయ్య పోలీసు అధికారులకు చెప్పారు. తన కుమారుడిని చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  బాలయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. 

విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శిస్తున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

సమగ్ర విచారణకు ఆదేశించిన ఆళ్లనాని 
ఏలూరు ఆశ్రం వైద్య కళాశాలలో వైద్య విద్యార్థి పుష్పం నాయక్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడనే సమాచారం అందుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని హుటాహుటిన ఆశ్రం కళాశాలకు వెళ్లారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ఏలూరుకు చేరుకున్న మంత్రి నానికి విద్యార్థి ఆత్యహత్య విషయం తెలియగానే ఆయన వెంటనే ఆశ్రంకు వెళ్ళారు. మృతుడు తండ్రి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉరివేసుకున్న హాస్టల్‌ గదిని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసు అధికారులను ఆరా తీశారు. ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అలాగే ఆత్మహత్యకు గత కారణాలను పూర్తిస్థాయిలో విచారించాలని జేసీ వేణుగోపాలరెడ్డిని ఆదేశించారు. 

ఎంతటి వారైనా వదిలేదిలేదు : ఆళ్ళనాని
డిప్యూటీ సీఎం ఆళ్ల నాని∙మాట్లాడుతూ వైద్య విద్యార్థి ఆత్మహత్యపై విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఆత్మహత్యకు ఒకవేళ ఎవరైనా కారణమైతే వారు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు సిద్దంగా ఉన్నామని భరోసా కల్పించారు.  మంత్రి నాని వెంట జేసీ వేణుగోపాలరెడ్డితోపాటు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుబ్రహ్మణ్యేశ్వరి, ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌ కిరణ్, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, డాక్టర్‌ దిరిశాల వరప్రసాద్, జేపీ, బొద్దాని శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాస్, నూకపెయ్యి సుధీర్‌బాబు ఉన్నారు.  

మరిన్ని వార్తలు