మృతదేహాన్ని ఒకరోజు దాచి.. చెరువులో వేశారు

11 Nov, 2019 09:33 IST|Sakshi
బుచ్యానాయక్‌ (ఫైల్‌) 

ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం

కరెంటుషాక్‌తో మృతిచెందిన వ్యక్తి  

పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు 

సాక్షి, రామాయంపేట(మెదక్‌): పంటచేను చుట్టూ పెట్టిన కరెంటువైర్లు తగిలి ఒక వ్యక్తి మృతిచెందగా, ఈసంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి విఫలయత్నంచేసిన కొందరు మృతదేహాన్ని ఒక రోజు దాచిఉంచిన తరువాత పధకం ప్రకారం చెరువులో పడవేశారు. సరిగా ఈ సంఘటన జరిగిన 9 రోజుల తరువాత అసలు విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. 

చెరువులో మృతదేహం లభ్యం.. 
మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కిషన్‌ తండా పంచాయతీ పరిధిలోని లాక్యతండాకు చెందిన చౌహాప్‌  బుచ్యానాయక్‌ (55) ఈనెల ఒకటిన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. 3వ తేదీన అతని మృతదేహాం ఘన్‌పూర్‌ మండలంలోని బ్యాతోల్‌ తిమ్మాయపల్లి శివారులో ఉన్న చెరువులో లభ్యమైంది. మృతుని రెండుకాళ్లకు కరెంటుషాకుతో గాయాలుకాగా, ఈవిషయమై తండాగిరిజనులు అనమానం వ్యక్తంచేశారు. 

కీలకమైన సీసీ ఫుటేజ్‌ ఆధారం.. 
కరెంటుషాకుతో మృతిచెందిన బుచ్యానాయక్‌ మృతదేహాన్ని చెరువులో వేశారని ఆరోజే మృతుని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఒకటిన రాత్రి బుచ్యానాయక్‌ కాట్రియాల గ్రామంలో ఆటోదిగి తన స్వగ్రామానికి కాలినడకన వెళ్లినట్లు గ్రామంలోని సీసీ పుటేజీతో నిక్షిప్తమైంది. దీనిని పరిశీలించిన మృతుని కుటుంబసభ్యులు ఈవిషయమై పోలీసులకు సమాచారం అందజేశారు. కాట్రియాల నుంచి మృతుడు నివాసం ఉంటున్న లాక్యతండాకు మధ్య దారిలో పరిశీలిస్తూ వెళ్లిన తండావాసులకు ఒకచోట అనుమానాస్పదంగా అగుపించింది. పంటచేను చుట్టూ కరెంటు కనెక్షన్‌ ఉండటంతోపాటు నేలపై పచ్చిగడ్డి చిందరవందరగా మారడంతో వారు అనుమానంతో ఆపంటచేనును ఖాస్తు చేస్తున్న వారిని ప్రశ్నించగా, వారు తప్పును అంగీకరించారు. ఒకటిన రాత్రి ఇదే స్థలంలో బుచ్యానాయక్‌ కరెంటుషాకుతో మృతిచెందగా, ఒకరోజు మృతదేహాన్ని ఇక్కడే దాచి ఉంచిన అనంతరం కారులో తీసుకెళ్లి బ్యాతోల్‌ తిమ్మాయపల్లి చెరువులో పడవేసినట్లు వారు అంగీకరంచారు. ఈ మేరకు వారిని ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై తండాలో సంచలనంగా మారింది. మృతునికి ఇద్దరు బార్యలతోపాటు ముగ్గురు సంతానం ఉన్నారు. 

మరిన్ని వార్తలు