కాలేజీకని వెళ్లి.. బావిలో శవమై

19 Jan, 2020 08:35 IST|Sakshi

కాళ్లూ, చేతులు తాళ్లతో కట్టి ఉన్న స్థితిలో మెడికో

సంఘటనపై అనుమానాలు

గతంలోనూ ఒకసారి ఆత్మహత్యాయత్నం

సాక్షి, కుమట్ల(రేగొండ): కాలేజీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ఓ యువకుడు తెల్లారేసరికి బావిలో శవమై తేలిన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కనిపర్తి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. కనిపర్తి గ్రామానికి చెందిన తుమ్మళ్లపల్లి తిరుపతి–రమాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా వంశీ(23) రెండో కుమారుడు. వంశీ ఖమ్మంలోని మమతా మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ 4వ సంవత్సరం చదువుతున్నాడు.సంక్రాంతి సందర్భంగా సొంతూరుకి వచ్చిన వంశీ శుక్రవారం మధ్యాహ్నం కాలేజీకి తిరుగు పయనం అయ్యాడు. సమీప బంధువైన రేపాక గ్రామానికి చెందిన రమేష్‌తో కలిసి ద్విచక్రవాహనంపై పరకాల బస్టాండ్‌లో వదిలిపెట్టాడు. కాలేజీ వెళ్లేసరికి రాత్రి 8 గంటలు అవుతుందని చేరుకున్న తరువాత ఫోన్‌ చేస్తానని తల్లిదండ్రులకు చెప్పిన వంశీ ఎంతకి ఫోన్‌ చేయలేదు.

శనివారం ఉదయం వంశీ తండ్రి తిరుపతి వ్యవసాయ పనుల నిమిత్తం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా అక్కడ వంశీ చెప్పులు, బ్యాగు కనిపించాయి. దీంతో కంగారుపడిన తిరుపతి.. గ్రామస్తుల సహాయంతో వ్యవసాయ బావిలో వెతకగా కుమారుడు వంశీ మృతదేహం లభించింది. కాగా, మృతదేహం కాళ్లను, చేతులను తాళ్లతో వెనక్కి కట్టేసి ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఘటనపై అనుమానాలు..
చేతులు, కాళ్లు వెనక్కి కట్టేసిన స్థితిలో బావిలో శవంగా కనిపించడం పలు అనుమానాలకు తావిస్తుంది. గతంలో కూడా వంశీ రెండు సార్లు ఇలాగే ఆత్మహత్యకు ప్రత్నింతించాడని తల్లిదండ్రులు, గ్రామస్తులు తెలిపారు. అయితే కాళ్లు, చేతులు కట్టేసి ఉండడంతో పోలీస్‌లు విచారణ చేపట్టారు. ఇతరాత్ర గొడవలు, ఎఫైర్‌లు ఏమైన ఉన్నాయా అనే కోణంలో ప్రాథమికంగా విచారణ చేపట్టారు.

గ్రామస్తులు, కుటుంబ సభ్యులు మాత్రం తామకు ఎవరూ శత్రువులు లేరని ఎవరితో గొడవలు కూడా లేవని, తమ కొడుకు ఇప్పటికీ సాధారణమైన ఫోన్‌నే వాడుతున్నాడని, ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడడని తెలిపారు. కాల్‌డేటా, సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని రేగొండ ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్‌ వెల్లడించారు. భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు ఘటన స్థలాన్ని, మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం పరకాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు