కార్లు అద్దెకు తీసుకోవడం.. ఆపై అమ్మేయడం

15 May, 2019 13:19 IST|Sakshi
విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ ఐశ్వర్యరస్తోగి

ఓ వ్యక్తి నిర్వాకం

అరెస్ట్‌ చేసిన పోలీసులు

ఐదు కార్లు స్వాధీనం  

నెల్లూరు(క్రైమ్‌): ఫైనాన్స్‌ వ్యాపారిని అంటూ నమ్మిస్తాడు. కార్లను అద్దెకు తిప్పుతానని నెలవారీ అద్దెకు ట్రావెల్స్‌ వద్ద నుంచి కార్లు తీసుకుని ఉడాయిస్తాడు. అనంతరం వాటిని కుదవ పెట్టడం లేదా విక్రయించి సొమ్ము చేసుకుని జల్సాగా జీవించసాగాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన నెల్లూరులోని బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.వేణుగోపాల్‌రెడ్డి మంగళవారం నిందితుడిని అరెస్ట్‌ చేశారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఐశ్వర్యరస్తోగి నిందితుడి వివరాలను వెల్లడించారు. తోటపల్లిగూడూరు మండలం వరిగొండ గ్రామానికి చెందిన అశోక్‌కుమార్‌రెడ్డి అలియాస్‌ అశోక్‌కుమార్‌ జల్సాలకు బానిసై నేరాలకు పాల్పడసాగాడు. కొంతకాలంగా అతను ఫైనాన్స్‌ వ్యాపారినని వాహనాలకు ఫైనాన్స్‌ ఇప్పిస్తానని పలువురిని నమ్మించాడు. ఈక్రమంలో ఆయనకు ట్రావెల్స్‌ యజమానులతో పరిచయాలయ్యాయి. కార్లు అద్దెకు తిప్పుతానని అందుకు గానూ రూ.25 వేలు నెలకు అద్దె చెల్లిస్తానని ట్రావెల్స్‌ యజమానులను నమ్మించేవాడు. అనంతరం కార్లు తీసుకుని వాటితో ఉడాయించేవాడు. వాహనాలను ఇతర ప్రాంతాల్లో కుదవ పెట్టడం లేదా రూ.లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకుని జల్సాగా జీవించసాగాడు.

ఫిర్యాదుతో వెలుగులోకి..
ఇటీవల అశోక్‌కుమార్‌ నెల్లూరు నగరానికి చెందిన ప్రజీత్‌రెడ్డి వద్ద కారును నెలవారీ అద్దెకు తీసుకున్నాడు. అనంతరం ఆ కారును అమ్మివేశాడు. నెలలు దాటుతున్నా కారును ఇవ్వకపోవడంతో ప్రజీత్‌రెడ్డి బాలాజీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం రామలింగాపురం సెంటర్‌ వద్ద అశోక్‌కుమార్‌ ఉన్నాడనే పక్కా సమాచారం అందుకున్న బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.వేణుగోపాల్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించగా వేదాయపాళెం, ఇందుకూరుపేటల్లో ఇదే తరహాలో మోసాలకు పాల్పడినట్లు అంగీకరించడంతో అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి రూ.40 లక్షలు విలువచేసే ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

గతంలో దొంగతనం కేసులో..
నిందితుడు గతంలో ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో రికవరీ ఏజెంట్‌గా పనిచేశాడు. ఆ సమయంలో తన స్నేహితులతో కలిసి రికవరీ సొత్తు రూ.లక్షలను దొంగతనం చేశాడు. ఈ కేసులో అరెస్టై జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన అశోక్‌కుమార్‌రెడ్డి ఆర్థిక మోసగాడిగా అవతారమెత్తి కార్లు అద్దెకు తీసుకుని వాటిని అమ్మి సొమ్ము చేసుకోసాగాడు. సొంత బంధువుల వద్ద సైతం అతను ఇదే తరహాలో మోçసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై గతంలో నెల్లూరు చిన్నబజారు పోలీసులు సస్పెక్ట్‌ షీటు తెరిచారు. అనంతరం షీట్‌ను టీపీ గూడూరు పోలీసు స్టేషన్‌కు బదలాయించారు.

సిబ్బందికి అభినందన
నిందితుడిని అరెస్ట్‌ చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్న బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్సై రమేష్‌బాబు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి అభినందించారు. అనంతరం వారికి నగదు ప్రోత్సాహకాలను అందించారు. సమావేశంలో ఏఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి, నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, చిన్నబజారు ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ అన్వర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు