పనిచేసే దుకాణానికే కన్నం

14 May, 2019 10:32 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ ఏవీఆర్‌ నర్సింహారావు నిందితుడు శివకుమార్‌

యువకుడి అరెస్ట్‌

దుండిగల్‌:  పని చేసే దుకాణంలోనే దొంగతనానికి పాల్పడిన యువకుడిని పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేట్‌ బషీరాబాద్‌ ఏసీపీ ఏవీఆర్‌ నర్సింహరావు వివరాలు వెల్లడించారు. విద్యానగర్‌ ప్రాంతానికి చెందిన శివకుమార్‌  సుభాష్‌నగర్‌ డివిజన్‌ కృషి కాలనీలో ఉంటూ కార్పెంటర్‌గా పని చేసేవాడు. కుత్బుల్లాపూర్‌ లోని పలు దుకాణాల్లో సామాగ్రిని తీసుకు వచ్చి పీస్‌ వర్క్‌ పనులు చేసేవాడు.

ఇటీవల గోదావరి హోమ్స్‌లోని సాయిబాలాజీ ఉడ్‌ డోర్‌ వర్క్స్‌ షాపులో పని మాట్లాడుకున్నాడు. తరచూ దుకాణానికి వచ్చే శివకుమార్‌ యజమానుల వద్ద ఎక్కువ డబ్బులు ఉండడాన్ని గుర్తించి వాటిని కాజేసేందుకు పథకం పన్నాడు.  ఈ నెల 11న దుకాణానికి వచ్చిన అతను వేతనం తీసుకుని వెళ్లాడు. అదే సమయంలో క్యాష్‌ కౌంటర్‌లో డబ్బులు ఉండటాన్ని గుర్తించిన అతను అదే రోజు రాత్రి నిచ్చెన సాయంతో దుకాణం సీలింగ్‌ రూఫ్‌ ను తొలగించి లోపలికి ప్రవేశించాడు. క్యాష్‌ కౌంటర్‌లో ఉన్న రూ.5.10 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లను దొంగిలించాడు. అయితే చోరీ సమయంలో మద్యం మత్తులో ఉన్న శివకుమార్‌ కిందికు దిగుతున్న సమయంలో పట్టుజారి కింద పడటంతో గాయపడ్డాడు. దుకాణ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు  శివకుమార్‌పై అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని  ప్రశ్నించగా చేసిన నేరం అంగీకరించాడు. అతడి నుంచి రూ.5.06 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు