రైలు పట్టాలు దాటుతూ యువకుడి మృతి

14 Feb, 2019 08:41 IST|Sakshi
భవానీ ప్రసాద్‌ (పాత చిత్రం)

విషాదంలో కుటుంబం సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ

వెళ్లడం వల్లే ఈ ప్రమాదం

తూర్పుగోదావరి, సామర్లకోట (పెద్దాపురం): పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన ఓ యువకుడిని బుధవారం రైలు ఢీ కొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. దివిలి గ్రామానికి చెందిన దూసనపూడి భవానీప్రసాద్‌ కాంట్రాక్టు వర్క్‌లు చేస్తూ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. తిరిగి విజయవాడ వెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంటి నుంచి బయలు దేరిన సమయంలో సామర్లకోటలో ఉన్న అన్నపూర్ణ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి అక్కడి నుంచి విజయవాడ వెళతానని చెప్పిన తన కొడుకు అదే ప్రదేశంలో విగతజీవయ్యాడని తల్లి పార్వతి బోరున విలపించింది.

స్వామి వారిని దర్శించుకొని రైల్వే స్టేషన్‌కు వచ్చే సమయంలో సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ రైలు పట్టాలు దాటుతుండగా సామర్లకోట నుంచి విశాఖపట్నం వెళుతున్న రైలు ఢీ కొంది. దీంతో బలమైన గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తండ్రి చనిపోవడంతో అమ్మను చెల్లెలను పోషించాల్సిన బాధ్యత భవానీ ప్రసాద్‌పై ఉంది. ఈ సమయంలో కుటుంబానికి ఆసరా లేకుండా పోయిందని తల్లి, చెల్లెలు, బంధువులు రోదించిన తీరువులు రోదించారు. సంఘటనా ప్రదేశానికి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు చేరుకొని మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు బాబ్జిరావు, త్రినాథ్‌ల సహకారంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. దివిలి గ్రామానికి చెందిన బంధువులు, మృతుడి స్నేహితులు రైల్వే పోలీసు స్టేషన్‌కు చేరుకోవడంతో రైల్వేస్టేషన్‌  ఆవరణ విషాద వాతావరణం నెలకొంది. కేసు నమోదు చేసి రైల్వే హెచ్‌సీ జె. గోవిందరావు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు