అవుటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రమాదం..

1 Mar, 2018 11:08 IST|Sakshi
భీమవరంలో శ్రీరామరాజు ఇంటి వద్ద విషాదఛాయలు, ప్రమాదంలో మృతి చెందిన వేగేశ్న శ్రీరామరాజు

వ్యాపారవేత్త శ్రీరామరాజు మృతి

భీమవరం టౌన్‌/కాళ్ల: తెలంగాణ రాష్ట్రం మేడ్చల్‌ జిల్లా ఘట్‌ కేసర్‌ అవుటర్‌ రింగు రోడ్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భీమవరానికి చెందిన ప్రముఖ ఆక్వా ఫీడ్‌ వ్యాపార వేత్త వేగేశ్న శ్రీరామరాజు అలియాస్‌ శ్రీరామ్‌ (30)మృతి చెందారు. కీసర నుంచి ఆయన కారులో వస్తుడంగా అవుటర్‌ రింగు రోడ్డు వద్ద డివైడర్‌ మధ్యలో ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని కారు పల్టీ కొట్టింది. సంఘటనలో ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. కారుపూర్తిగా దగ్ధమైంది. 108 వాహనంలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఆయన మృతిచెందారు. భీమవరం కాస్మో పాలిటన్‌ క్లబ్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న వేగేశ్న శ్రీరామరాజుకు భార్య మౌనికా శ్రీదేవి, ఒక బాబు, ఒక పాప ఉన్నారు. ఆయన తండ్రి వేగేశ్న కృష్ణంరాజు కాళ్ల మండలం కోపల్లె గ్రామ ఉప సర్పంచ్‌గా సేవలందిస్తున్నారు.

గతంలో ఆయన ఆ గ్రామ సర్పంచ్‌గా కూడా సేవలందించారు. కృష్ణంరాజు పెద్ద కుమారుడు రవీంద్ర వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీరామరాజు అన్నయ్యను కలిసి ఆ తర్వాత పనులు చూసుకుని తిరిగి కారులో వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్టు సమాచారం. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అందరితో సన్నిహితంగా ఉంటూ పదిమందికి సహాయపడే శ్రీరామరాజు మృతితో భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో విషాదం అలముకుంది. ఉండి మాజీ ఎమ్మెల్యేల పాతపాటి సర్రాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మున్సిపల్‌ చైర్మన్‌ కొటికలపూడి గోవిందరావు, వైస్‌ చైర్మన్‌ ముదునూరి సూర్యనారాయణరాజు, డీఎన్నార్‌ కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు గోకరాజు రామరాజు, కలవపూడి సొసైటీ అధ్యక్షుడు మంతెన రాంబాబు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, కౌన్సిల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గాదిరాజు తాతరాజు, కౌన్సిలర్‌ సుబ్బరాజు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు